యెమెన్‌లో హౌతీ రెబల్స్ మరోసారి ఎర్ర సముద్రం పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తతకు తెరలేపారు. సౌదీ అరేబియాకు చెందిన సైనిక ల్యాండింగ్ నౌకను బాలిస్టిక్ క్షిపణితో లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా, ఓ ఆయుధ డిపోపై డ్రోన్లతో దాడి చేశారు.

ఆగస్టు 9న ఎర్ర సముద్రాన్ని బాబ్ ఎల్ మాండేబ్ జలసంధితో అనుసంధానించే కీలక నౌకాశ్రయ పట్టణమైన మోచాపై కూడా హౌతీలు దాడికి పాల్పడ్డారు. వరుస దాడులతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత మరింత పెరిగింది.

ఎర్ర సముద్రంలో సౌదీ అరేబియా సైనిక ల్యాండింగ్ నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ మద్దతున్న హౌతీ రెబల్స్ బాలిస్టిక్ క్షిపణులతో దాడికి పాల్పడ్డారు. యెమెన్‌లోని నైరుతి రేవు పట్టణం మోచా తీరంలో సోమవారం ఈ దాడి జరిగినట్లు హౌతీలు ప్రకటించారు. సైనిక ల్యాండింగ్ నౌకతో పాటు దానికి రక్షణగా ఉన్న నాలుగు ఎస్కార్ట్ పడవలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు.

హౌతీ సైనిక అధికార ప్రతినిధి యాహ్యా సారీ మాట్లాడుతూ.. తమ దళాలు పలు బాలిస్టిక్ క్షిపణులతో అత్యంత ఖచ్చితత్వంతో దాడులు నిర్వహించాయని వెల్లడించారు. దాడి అనంతరం సైనిక ల్యాండింగ్ నౌకలో మంటలు చెలరేగినట్లు, కొన్ని ఎస్కార్ట్ పడవలు మునిగిపోగా మరికొన్నింటికి మంటలు అంటుకున్నట్లు పేర్కొన్నారు.

అదే సమయంలో యెమెన్‌లోని ఈశాన్య మారీబ్ ప్రావిన్సులో సౌదీ దళాలు వినియోగిస్తున్న ఆయుధ డిపోను కూడా హౌతీలు డ్రోన్లతో లక్ష్యంగా చేసుకున్నట్లు సారీ తెలిపారు. సైన్ అల్-జిన్ క్యాంప్‌లోని ఆయుధ నిల్వ కేంద్రంపై జరిగిన ఈ దాడి కారణంగా భారీగా మంటలు చెలరేగినట్లు ఆయన వెల్లడించారు.

అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వానికి సౌదీ అరేబియా కీలక మద్దతుదారుగా ఉంది. సౌదీకి సంబంధించిన లక్ష్యాలు, ప్రభుత్వ నియంత్రణలోని ప్రాంతాలపై హౌతీల దాడులు ఇటీవలి కాలంలో తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఈ తాజా దాడులు చోటుచేసుకున్నాయి.

వ్యూహాత్మకంగా కీలకమైన బాబ్ ఎల్-మాండెబ్ జలసంధికి సమీపంలో ఉన్న ప్రభుత్వ నియంత్రణలోని మోచా ఓడరేవు పట్టణం ప్రస్తుతం ఈ ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌తో అనుసంధానించే ఈ పోర్టు.. ప్రపంచంలోని అత్యంత కీలకమైన సముద్ర వాణిజ్య మార్గాల్లో ఒకదానికి సమీపంలో ఉంది.

ఆగస్టు 9 నుంచి మోచా, దాని పరిసర ప్రాంతాల్లో హౌతీలు వరుసగా దాడులకు పాల్పడుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ దాడుల్లో భారీగా ప్రాణనష్టం సంభవించడంతో పాటు మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. అలాగే, ఈ పరిణామాల ప్రభావంతో నౌకా రవాణా కార్యకలాపాలకు కూడా అంతరాయం ఏర్పడినట్లు సమాచారం.