పాక్‌ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓ మతబోధకుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. పంజాబ్‌ ప్రావిన్స్‌లోని బహావల్‌నగర్‌లో ఆగస్టు 14న నిర్వహించిన ఓ సమావేశంలో ప్రసంగించిన నసీర్‌ మాద్నీ కశ్మీర్‌కు సంబంధించి సంచలన ఆరోపణలు చేశాడు.

లష్కరే తొయిబా (ఎల్‌ఈటీ) చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ కశ్మీర్‌లోకి 10 వేల మంది ఉగ్రవాదులను పంపించినట్లు మాద్నీ పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు కశ్మీర్‌లో ఉగ్ర నెట్‌వర్క్‌ విస్తరణపై మరోసారి ఆందోళనలు రేకెత్తించాయి. హఫీజ్‌ సయీద్‌ నేతృత్వంలోని లష్కరే తొయిబా భారత్‌లో పలు ఉగ్రదాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

2008 నవంబర్‌ 26న ముంబైలో జరిగిన 26/11 ఉగ్రదాడుల్లో పాక్‌కు చెందిన ఉగ్రవాదులు సముద్రమార్గంలో నగరంలోకి ప్రవేశించి నాలుగు రోజులపాటు మారణహోమం సృష్టించారు. ఈ దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయపడ్డారు.

ఇక 2025లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మరణించారు. ఈ కేసుకు సంబంధించి జమ్మూలోని ఓ కోర్టు హఫీజ్‌ సయీద్‌పై నాన్‌-బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసినట్లు సమాచారం.

లష్కరే తొయిబాను ఐక్యరాజ్యసమితి, అమెరికా ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి. తాజాగా నసీర్‌ మాద్నీ చేసిన వ్యాఖ్యలతో కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి కొత్త చర్చ మొదలైంది.

By Rajini