D News: Aug 18: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని మాతాజీ హార్డ్‌వేర్ గోదాంలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నర్సాపూర్–సంగారెడ్డి ప్రధాన రహదారి పక్కన ఉన్న ఈ గోదాంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.

గోదాం నుంచి దట్టమైన పొగతో పాటు మంటలు భారీగా ఎగసిపడటంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సకాలంలో స్పందించి చర్యలు చేపట్టడంతో మంటలు గోదాంలోని ఇతర ప్రాంతాలకు, సమీపంలోని భవనాలకు వ్యాపించకుండా నియంత్రించగలిగారు.

అగ్నిమాపక సిబ్బంది సత్వర చర్యలతో పెను ప్రమాదం తప్పింది. మంటలు మరింతగా వ్యాపించి ఉంటే భారీగా ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉండేదని స్థానికులు తెలిపారు.

అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా? లేదా మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గోదాంలో జరిగిన ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.