
D Spiritual: Aug 18: మంగళవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతిని పురస్కరించుకుని పసుపులేరు ఒడ్డున రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీసీ అధికారులు, బీసీ కుల సంఘాలు, ఇతర కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. జిల్లా కవులు, కళాకారులకు నిలయంగా ఉందన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్రను రచించి, భావితరాలకు పుస్తక రూపంలో అందించాలని సూచించారు.
అణగారిన వర్గాలు, శ్రమజీవుల కష్టాన్ని దోచుకునే వారిని ఎదిరించి పోరాడిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కలెక్టర్ కొనియాడారు. సమాజ శ్రేయస్సు కోసం ఆయన నిరంతరం తపించారని, చైతన్యానికి స్ఫూర్తినిచ్చిన ఆ పోరాట యోధుడి గాథలను ప్రతి ఒక్కరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఉపేందర్, బీసీ వెల్ఫేర్ సహాయ అధికారి గంగా కిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నరసింహారెడ్డి, బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా అధ్యక్షులు నోముల శ్రీకాంత్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు రమేష్ గౌడ్ పాల్గొన్నారు.
అలాగే బీసీ కుల సంఘ ప్రతినిధులు దామోదర్ గౌడ్, జనార్దన్ గౌడ్, కృష్ణ గౌడ్, చింతకింది కృష్ణగౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్‌తో పాటు ఇతర కుల సంఘాల ప్రతినిధులు, బీసీ సంక్షేమ శాఖ కార్యాలయ సిబ్బంది తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
