
D Spiritual: Aug 18: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి నవంబర్ నెల ఆర్జిత సేవా టికెట్ల ఆన్లైన్ కోటా విడుదలకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) షెడ్యూల్ ఖరారు చేసింది. భక్తులు ఆన్లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునేలా టీటీడీ అధికారిక వెబ్సైట్లో ఈ ప్రక్రియను నిర్వహించనుంది.
సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన
సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి ప్రముఖ ఆర్జిత సేవల ఎలక్ట్రానిక్ డిప్ (లక్కీ డిప్) రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 18వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. భక్తులు ఆగస్టు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.
లక్కీ డిప్లో ఎంపికైన భక్తులు ఆగస్టు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు నిర్ణీత సేవా రుసుమును చెల్లించి తమ టికెట్లను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
అలాగే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, పుష్పయాగం వంటి ఇతర ఆర్జిత సేవల టికెట్ల కోటాను ఆగస్టు 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటికి సంబంధించిన దర్శన స్లాట్లను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇతర దర్శన టికెట్ల విడుదల
ఇతర దర్శన కోటాలకు సంబంధించి ఆగస్టు 24వ తేదీన అంగప్రదక్షిణం టోకెన్లు, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్లు, వృద్ధులు, దివ్యాంగుల ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను విడుదల చేయనున్నారు.
నవంబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆగస్టు 25వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని అద్దె గదుల బుకింగ్ కోటాను కూడా విడుదల చేయనున్నారు.
భక్తులు నిర్ణీత తేదీలు, సమయాలను గమనించి టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే టికెట్లు, వసతి గదులను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. భక్తులు ఈ ఆన్లైన్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.
