బిహార్‌లోని లఖిసరాయ్ అశోక్ ధామ్ ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేసిన ఆయన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు స్థానిక యంత్రాంగం అన్ని విధాలా సహాయం అందిస్తోందని పేర్కొన్నారు.

ఈ మేరకు ప్రధాని మోదీ ఎక్స్‌లో స్పందిస్తూ “బిహార్‌లోని లఖిసరాయ్‌లో జరిగిన తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసింది. ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధితులకు స్థానిక యంత్రాంగం సహాయం అందిస్తోంది” అని తెలిపారు.

మరోవైపు, మృతుల కుటుంబాలకు బిహార్ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు వెల్లడించింది. లఖిసరాయ్ జిల్లా మేజిస్ట్రేట్ శైలేంద్ర కుమార్ ప్రమాదానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. శ్రావణ మాసం సందర్భంగా జలాభిషేకం చేసేందుకు వేలాది మంది భక్తులు అశోక్ ధామ్ ఆలయానికి చేరుకున్నారని తెలిపారు. దర్శనం కోసం మహిళలు, పురుషులకు వేర్వేరుగా క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

పురుషుల క్యూ లైన్‌కు సమీపంలో ఓ విద్యుత్ స్తంభం అకస్మాత్తుగా కూలిపోయిందని తెలిపారు. అయితే ఆ స్తంభానికి విద్యుత్ వైర్లు కాకుండా కేబుల్ వైర్ మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు. స్తంభం కూలిన వెంటనే అది విద్యుత్ వైర్ అని పుకారు వ్యాపించడంతో భక్తుల్లో భయాందోళనలు నెలకొని తొక్కిసలాట జరిగిందని వివరించారు.

ఈ ఘటనలో సుమారు రెండు నిమిషాల వ్యవధిలో ఏడుగురు మృతి చెందగా 12 మందికి పైగా గాయపడినట్లు జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. క్షతగాత్రులను వెంటనే సదర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. మృతులు, గాయపడిన వారి పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తున్నారని వెల్లడించారు.

By Rajini