
పదకొండేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు జరిగిన విచారణను సుప్రీంకోర్టు పక్కనపెట్టింది. కేసును మళ్లీ మొదటి నుంచి విచారించనున్నట్లు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది.
ఈ కేసు నమోదు చెల్లదంటూ 2021 జూలై 22న రేవంత్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అవినీతి నిరోధక చట్టంలోని అప్పటి నిబంధనల ప్రకారం లంచం ఇవ్వడానికి కుట్ర చేయడం నేరం కాదని శాసన మండలి ఎన్నికల్లో ఓటు వేయడం లేదా వేయకపోవడం కూడా ఆ చట్టం పరిధిలోకి రాదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
మరోవైపు, కేసులో తన పేరును తొలగించాలని కోరుతూ సండ్ర వెంకట వీరయ్య 2021 ఏప్రిల్ 13న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లను కలిపి విచారిస్తున్న ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చి జస్టిస్ వి. మోహన్ ఉన్నారు.
గురువారం విచారణ సందర్భంగా ఇరుపక్షాల న్యాయవాదులు సుదీర్ఘ వాదనలు వినిపించాల్సి ఉందని విచారణను వాయిదా వేయాలని కోరారు. దీనిపై స్పందించిన సీజేఐ గతంలో కేసును విచారించిన ధర్మాసనంలోని ఓ న్యాయమూర్తి పదవీ విరమణ చేసినందున ఇప్పటివరకు జరిగిన విచారణను పరిగణనలోకి తీసుకోబోమని తెలిపారు. దీంతో కేసు విచారణ మళ్లీ మొదటి నుంచి ప్రారంభం కానుంది.
