రైల్వే ఉద్యోగులకు రైళ్లలో ఉచితంగా ప్రయాణించే సదుపాయం ఉన్న విషయం తెలిసిందే. ఇందుకోసం రైల్వే శాఖ వారికి ప్రత్యేకంగా ప్రివిలేజ్ పాస్‌లను జారీ చేస్తుంది. అయితే ఈ పాస్‌తో అపరిమితంగా అన్ని రైళ్లలో తమకు నచ్చిన విధంగా ప్రయాణించే అవకాశం ఉండదు. దీనికి కొన్ని నిబంధనలు, పరిమితులు ఉంటాయి.

రైల్వే ఉద్యోగులకు జారీ చేసే పాస్ ద్వారా సాధారణ రైళ్లతో పాటు రాజధాని, శతాబ్ది, వందే భారత్, దురంతో, గతిమాన్ వంటి ప్రీమియం రైళ్లలోనూ ప్రయాణించవచ్చు. అయితే ఉద్యోగి హోదా, జీతం, అర్హత ఆధారంగా కేటాయించిన తరగతిలోనే ప్రయాణించాల్సి ఉంటుంది. లగ్జరీ లేదా తమకు అర్హత లేని కోచ్‌లలో ప్రయాణించేందుకు పాస్ వర్తించదు.

అర్హత ఉన్న తరగతి కాకుండా ఇతర కోచ్‌లో ప్రయాణించాలనుకునే ఉద్యోగులకు ప్రివిలేజ్ టికెట్ ఆర్డర్ (PTO) సదుపాయం ఉంటుంది. ఈ విధానంలో ఉద్యోగి అతని కుటుంబ సభ్యులు సాధారణ టికెట్ ఛార్జీలో మూడో వంతు చెల్లించాలి. ఇందుకోసం ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఉచిత ప్రివిలేజ్ పాస్‌కు భిన్నమైన సదుపాయం.

అలాగే ఐఆర్‌సీటీసీ నిర్వహించే కొన్ని ప్రత్యేక పర్యాటక రైళ్లకు రైల్వే ఉద్యోగుల పాస్ వర్తించదు. అలాంటి రైళ్లలో ఉద్యోగులు కూడా ఇతర ప్రయాణికుల మాదిరిగానే టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించాల్సి ఉంటుంది.

మొత్తంగా రైల్వే ఉద్యోగులకు పాస్ ద్వారా ఉచిత ప్రయాణ సౌకర్యం ఉన్నప్పటికీ అది అపరిమిత ప్రయాణానికి అనుమతి ఇవ్వదు. రైలు రకం ప్రయాణ తరగతి, ఉద్యోగి అర్హత, పాస్ నిబంధనలను అనుసరించి మాత్రమే ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది.

By Rajini