
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెల టర్కీలోని అంకారాలో జరిగిన నాటో సదస్సుకు హాజరయ్యారు. సదస్సు ముగించుకుని టర్కీ నుంచి బయలుదేరే సమయంలో ఆయన భద్రతకు సంబంధించి అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ నుంచి క్షిపణి దాడి ముప్పు ఉందన్న అమెరికా నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ట్రంప్‌ను అత్యంత రహస్యంగా మరో విమానంలో తరలించినట్లు సమాచారం.
ప్రమాదాన్ని తప్పించేందుకు అమెరికా అధికారులు ప్రత్యేక డీకాయ్ ఆపరేషన్ చేపట్టారు. ట్రంప్ ఎయిర్‌ఫోర్స్ వన్‌లోనే ప్రయాణిస్తున్నారనే భావన కలిగించేలా ఆ విమానాన్ని కొనసాగిస్తూనే.. ఆయనను మరో సైనిక విమానంలో రహస్యంగా తరలించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. ఈ ఘటనపై న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ సహా పలు మీడియా సంస్థలు సంచలన వివరాలను వెలుగులోకి తెచ్చాయి.
టర్కీలో గత నెల జరిగిన నాటో సదస్సుకు హాజరైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రహస్యంగా విమానం మార్చిన ఘటన వెనుక తీవ్ర భద్రతా ముప్పు ఉన్నట్లు తాజాగా వెల్లడైంది. ట్రంప్ ప్రయాణిస్తున్న ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానంపై ఇరాన్ క్షిపణి దాడి చేసే అవకాశం ఉందన్న సమాచారాన్ని అమెరికా నిఘా వర్గాలు సేకరించినట్లు ‘న్యూయార్క్ టైమ్స్’ సంచలన కథనాన్ని ప్రచురించింది.
నాటో సదస్సు చివరి రోజైన జులై 8న ట్రంప్ అంకారా నుంచి బయలుదేరేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న ఇద్దరు అమెరికా అధికారుల వివరాల ప్రకారం.. ట్రంప్ ప్రయాణిస్తున్న విమానాన్ని లక్ష్యంగా చేసుకుని ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణితో దాడి జరిగే నిర్దిష్ట ముప్పు ఉందనే హెచ్చరికలు అమెరికా భద్రతా సంస్థలకు వేర్వేరు మార్గాల ద్వారా అందాయి.
ఈ సమాచారం నేపథ్యంలో ట్రంప్ భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఆయన ప్రయాణ ప్రణాళికలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
నాటో సదస్సు జరిగిన ప్రాంతానికి సమీపంలో ఓ వ్యక్తి భుజంపై మోసుకెళ్లే క్షిపణి ప్రయోగ వ్యవస్థతో కనిపించినట్లు మరో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. అదే సమయంలో అంకారాలో ట్రంప్ బస చేసిన భవనం, ఆయన ఉన్న అంతస్తు సహా అధ్యక్షుడి కదలికలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇరాన్ ఏజెంట్లకు చేరినట్లు అమెరికా నిఘా వర్గాలు అనుమానించాయి.
ఈ సమాచారాన్ని అత్యంత విశ్వసనీయమైనదిగా పరిగణించిన అమెరికా అధికారులు.. ట్రంప్ భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఆయనను టర్కీ నుంచి సురక్షితంగా తరలించేందుకు అనూహ్యమైన రహస్య ఆపరేషన్‌ను చేపట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఘటనకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.
