
D Educt: Aug 13: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో విధులకు గైర్హాజరయ్యే ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిపై విద్యాశాఖ కఠిన నిర్ణయం తీసుకుంది. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా వరుసగా ఏడాది పాటు విధులకు హాజరుకాని ఉపాధ్యాయులు, సిబ్బందిని సర్వీసు నుంచి శాశ్వతంగా తొలగించాలని విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఐదేళ్ల పాటు విధులకు గైర్హాజరైన వారిని స్వచ్ఛందంగా ఉద్యోగానికి రాజీనామా చేసినట్లుగా పరిగణిస్తామని తెలిపింది.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు క్రమం తప్పకుండా బోధన అందేలా చూడటమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని విద్యాశాఖ పేర్కొంది. విధులకు గైర్హాజరయ్యే సిబ్బంది కారణంగా విద్యార్థుల చదువుకు ఇబ్బందులు తలెత్తకుండా క్రమశిక్షణను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది.
విధులకు డుమ్మా కొట్టే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని విద్యాశాఖ హెచ్చరించింది. గైర్హాజరు కేసుల్లో చర్యలు తీసుకోవడంలో జాప్యం జరిగితే సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు (HM), మండల విద్యాధికారులు (MEO), జిల్లా విద్యాధికారులను (DEO) బాధ్యులను చేస్తామని స్పష్టం చేసింది.
గైర్హాజరు వ్యవహారాల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో క్రమశిక్షణారాహిత్యానికి తావులేకుండా చేయడంతో పాటు విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఈ నిబంధనలను కఠినతరం చేసినట్లు పేర్కొంది.
