
వరంగల్: ప్రత్యేక ఓటరు సవరణ జాబితా (ఎస్ఐఆర్) ప్రక్రియలో పట్టణాల్లో నివసిస్తున్న పల్లెవాసులు తమ ఓటు హక్కును సొంత గ్రామాల్లోనే కొనసాగించేందుకు మొగ్గుచూపారు. ఈ నెల 10తో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగియగా ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాలు పట్టణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఓట్లు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు బదిలీ అయినట్లు స్పష్టం చేస్తున్నాయి.
వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి పిల్లల చదువులు, ఉద్యోగాలు, వ్యాపారం, ఉపాధి కోసం పట్టణాలకు వచ్చిన పలువురు ఇప్పటివరకు గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ ఓట్లు కలిగి ఉన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా వీరిలో చాలామంది పట్టణాల్లో ఉన్న ఓటు హక్కును తొలగించుకుని, సొంత గ్రామాల్లోనే కొనసాగించేలా శాశ్వతంగా బదిలీ చేసుకున్నారు.
గ్రామాల్లో ఓటు హక్కు ఉంటే రైతుబంధు ఉపాధి హామీతోపాటు ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందవచ్చన్న భావన కూడా ఈ మార్పులకు కారణంగా కనిపిస్తోంది. పట్టణాల్లో నివసిస్తున్నప్పటికీ తమ స్వగ్రామాల్లోనే ఓటు ఉండేలా పలువురు పర్మినెంట్ షిఫ్టింగ్ చేసుకున్నారు. దీంతో ఒకే వ్యక్తికి గ్రామం పట్టణంలో రెండు చోట్ల ఓటు ఉండే పరిస్థితికి ఎస్ఐఆర్ ద్వారా అడ్డుకట్ట పడినట్లయింది.
పర్మినెంట్ షిఫ్టింగ్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం ముందంజలో ఉంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,60,437 మంది ఓటర్లు ఉండగా 30,411 మంది తమ ఓటును శాశ్వతంగా బదిలీ చేసుకున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో 2,76,272 మంది ఓటర్లకు గాను 18,307 మంది పర్మినెంట్ షిఫ్టింగ్ చేసుకున్నారు. నర్సంపేట నియోజకవర్గంలో మొత్తం 2,40,244 మంది ఓటర్లు ఉండగా 7,857 మంది ఓటర్లు తమ ఓటు హక్కును శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు బదిలీ చేసుకున్నారు. మూడు నియోజకవర్గాల్లో కలిపి 56,575 మంది ఓటర్లు పర్మినెంట్ షిఫ్టింగ్ చేసుకోవడం గమనార్హం.
