
D Educt: Aug 12: తెలంగాణలో విద్య, నైపుణ్యాభివృద్ధి, క్రీడా రంగాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. తొలుత లండన్‌లో, అనంతరం అమెరికాలోని ప్రముఖ విద్యాసంస్థలను సందర్శించి ఆయా సంస్థల ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. ఆగస్టు 19న హైదరాబాద్ నుంచి బయలుదేరి, 30న తిరిగి హైదరాబాద్‌కు చేరుకునేలా సీఎం విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు, ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ వైస్ ఛైర్‌పర్సన్ శాంతికుమారి, పలువురు ఉన్నతాధికారులు సీఎంతో పాటు వెళ్లనున్నట్లు సమాచారం.
వివిధ విదేశీ విశ్వవిద్యాలయాలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విస్తరిస్తున్న నేపథ్యంలో వైట్‌కాలర్ ఉద్యోగాల భవిష్యత్తు, బ్లూకాలర్ ఉద్యోగాలకు అవసరమైన కొత్త నైపుణ్యాలు, యువతలో నెలకొన్న ఉద్యోగ భద్రతపై ఆందోళన వంటి అంశాలపై ఈ పర్యటనలో ప్రధానంగా చర్చించనున్నారు. తెలంగాణ యువతకు భవిష్యత్ ఉద్యోగ మార్కెట్‌కు అనుగుణంగా శిక్షణ, విద్యా అవకాశాలను పెంచే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
లండన్ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్, లండన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ తదితర ప్రముఖ విద్యాసంస్థలను సందర్శించనున్నారు. ఆయా విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో సమావేశమై విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై చర్చలు జరపనున్నారు. పలు సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
లండన్ పర్యటనలో విద్యతో పాటు క్రీడా రంగంపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీలు, క్రీడా మౌలిక వసతుల ప్రాజెక్టులు, స్పోర్ట్స్ మెడిసిన్, అథ్లెట్ల శిక్షణ, ‘ట్రైన్ ది ట్రైనర్’ వంటి అంశాలపై బ్రిటన్ నిపుణులతో చర్చలు జరపనున్నారు. క్రీడా రంగంలో బ్రిటన్ అనుభవాలను తెలుసుకుని తెలంగాణలో క్రీడా మౌలిక వసతులు, శిక్షణ వ్యవస్థను మరింత మెరుగుపరిచే అవకాశాలను పరిశీలించనున్నారు.
ఆగస్టు 23న సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం అమెరికాకు వెళ్లనుంది. అక్కడ తొలుత హార్వర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీ వంటి ప్రముఖ విద్యాసంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. హార్వర్డ్, ఎంఐటీ సహా పలు విశ్వవిద్యాలయాలకు చెందిన డీన్లు, ప్రొఫెసర్లతో విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై చర్చలు జరపనున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్, ఇంజినీరింగ్, ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ వంటి విభాగాల్లో తెలంగాణ విద్యార్థులు, యువతకు మరిన్ని అవకాశాలు కల్పించే అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. అమెరికా పర్యటనలో న్యూయార్క్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రముఖ విద్యాసంస్థల ప్రతినిధులతోనూ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
ఆర్కిటెక్చర్, మెడిసిన్ తదితర ప్రత్యేక విభాగాలకు చెందిన సంస్థలతో కూడా చర్చలు జరిపి తెలంగాణలో ఆయా రంగాల్లో విద్య, శిక్షణ అవకాశాలను పెంచే అంశాలను పరిశీలించనున్నారు. ఈ విదేశీ పర్యటన ద్వారా అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు, నిపుణులతో భాగస్వామ్యాలను పెంచుకుని తెలంగాణ విద్యార్థులు, యువతకు మెరుగైన విద్య, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
