D Spiritual: Aug 12: హైదరాబాద్‌ లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయ హుండీ లెక్కింపు పూర్తయింది. బోనాల సందడి ముగిసిన అనంతరం చేపట్టిన ఈ లెక్కింపులో నగదుతో పాటు బంగారం, వెండి కానుకలు లభించాయి. ముఖ్యంగా హుండీలో 170 గ్రాముల జర్మన్‌ సిల్వర్‌ లభించడం ఆసక్తికరంగా మారింది. ఆలయానికి 12 రోజుల వ్యవధిలో వివిధ రూపాల్లో మొత్తం రూ.9,90,726 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

హుండీల ద్వారా రూ.6,26,226 నగదు సమకూరినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన ఆదాయం ఇతర కానుకలు, పూజా టికెట్లు, కొబ్బరికాయలు, శాంతి కల్యాణం తదితరాల ద్వారా వచ్చినట్లు వెల్లడించారు. లాల్‌దర్వాజా బోనాల సందర్భంగా అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించడంతో ఆలయానికి భారీగా కానుకలు వచ్చాయి.

హుండీ లెక్కింపు సందర్భంగా 0.06 గ్రాముల బంగారం, 0.28 గ్రాముల వెండితో పాటు 170 గ్రాముల జర్మన్‌ సిల్వర్‌ లభించినట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా భక్తులు నగదు, బంగారం, వెండి రూపంలో మొక్కులు చెల్లిస్తుంటారు. అయితే ఈసారి జర్మన్‌ సిల్వర్‌ కూడా హుండీలో లభించడం ప్రత్యేకంగా నిలిచింది. సాధారణ వెండితో పోలిస్తే జర్మన్‌ సిల్వర్‌ ధర తక్కువగా ఉంటుందని, తులం సుమారు రూ.300 నుంచి రూ.400 వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ లెక్కన 17 తులాల విలువ సుమారు రూ.5,100గా ఉంటుంది.

హుండీల లెక్కింపు సమయంలో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సీజ్ చేసిన నాలుగు హుండీలను అధికారులు సులభంగా తెరిచి అందులోని కానుకలను లెక్కించారు. అయితే మరో హుండీకి ఉన్న లాక్ ఎంత ప్రయత్నించినా తెరుచుకోలేదు. దీంతో చివరకు వెల్డింగ్ మిషన్ సహాయంతో లాక్‌ను కట్ చేసి హుండీని తెరిచారు. అనంతరం అందులోని కానుకలను లెక్కించి ప్రక్రియను పూర్తి చేశారు.

లాల్‌దర్వాజా బోనాల సందర్భంగా అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తాజాగా హుండీల లెక్కింపు పూర్తవడంతో 12 రోజుల వ్యవధిలో ఆలయానికి వచ్చిన ఆదాయం, భక్తులు సమర్పించిన కానుకల వివరాలను అధికారులు వెల్లడించారు.