
D Spiritual: Aug 12: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. మనోహరాబాద్–సిద్దిపేట రైల్వే లైన్లో కొమురవెల్లి మీదుగా భక్తుల రాకపోకలకు అనుకూలంగా ఉండేలా కొత్త డెమూ (DEMU) రైలును ప్రవేశపెట్టేందుకు రైల్వే అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట వైపు ఉదయం 10:35 గంటలకు బయలుదేరే డెమూ రైలు కొమురవెల్లికి చేరుకునే సమయానికి మధ్యాహ్నం అవుతోంది. దీంతో ఆలయానికి చేరుకునే సరికి మధ్యాహ్న దర్శన వేళలు ముగిసిపోతున్నాయి. ఆలయం తిరిగి తెరిచే వరకు భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. దర్శనం పూర్తయిన తర్వాత అదే రోజు సొంత ఊళ్లకు తిరిగి వెళ్లేందుకు అనువైన రైలు సదుపాయం లేకపోవడంతో మహిళలు, వృద్ధులు, చిన్నారులతో వచ్చే కుటుంబాలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో వారికి అదనపు ఆర్థిక భారం, రవాణా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
కొత్త డెమూ రైలును అందుబాటులోకి తీసుకురావడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రక్రియను ప్రారంభించారు. ఇందులో భాగంగా ముందుగా కొమురవెల్లి ఆలయానికి వచ్చే భక్తులు, ఈ మార్గంలో రోజువారీగా ప్రయాణించే వారి సంఖ్యను అంచనా వేయనున్నారు. ప్రయాణికుల రద్దీ, అంచనా ఆదాయం, నిర్వహణ వ్యయాలపై సమగ్ర ట్రాఫిక్ సర్వే నిర్వహించి నివేదికను సిద్ధం చేయనున్నారు.
అనంతరం భక్తులకు అనుకూలంగా ఉండేలా రైలు టైమ్‌టేబుల్‌ను రూపొందించనున్నారు. ఉదయం కొమురవెల్లికి చేరుకునేలా, సాయంత్రం తిరిగి ప్రయాణించేలా రైలు వేళలను నిర్ణయించనున్నారు. కొమురవెల్లితో పాటు ఇతర కీలక స్టేషన్లలో రైలు నిలిచే హాల్ట్లను కూడా ఖరారు చేయనున్నారు.
అదే సమయంలో ఈ మార్గంలో ఇప్పటికే నడుస్తున్న ఇతర రైళ్లకు ఎలాంటి అంతరాయం కలగకుండా రైల్వే లైన్ సామర్థ్యం, సిగ్నలింగ్ వ్యవస్థ, క్రాసింగ్ ప్రక్రియ, స్టేషన్ల సామర్థ్యాన్ని అధికారులు పరిశీలించనున్నారు. అవసరమైన సాంకేతిక తనిఖీలు పూర్తయిన తర్వాత రైలు నడిపేందుకు రూట్ క్లియరెన్స్ ఇవ్వనున్నారు.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (GM) ఆమోదం అనంతరం పూర్తి నివేదికను రైల్వే బోర్డు, టైమ్‌టేబుల్ కమిటీకి పంపించనున్నారు. అక్కడి నుంచి తుది అనుమతులు లభించిన తర్వాత కొత్త డెమూ రైలుకు రేక్‌ను కేటాయించే అవకాశం ఉంటుంది.
సర్వే, లైన్ కెపాసిటీ పరిశీలన, టైమ్‌టేబుల్ రూపకల్పన, వివిధ స్థాయిల్లో అనుమతులు, రైల్వే బోర్డు తుది ఆమోదం వంటి ప్రక్రియలన్నీ పూర్తయ్యేందుకు కనీసం ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
