సిరియా మాజీ అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌, ఆయన సోదరుడు మహెర్‌ అల్‌ అసద్‌లకు డమాస్కస్‌లోని నాలుగో క్రిమినల్‌ కోర్టు మరణశిక్ష విధించింది. సిరియాలో దాదాపు 14 ఏళ్లుగా కొనసాగిన అంతర్యుద్ధం సమయంలో హత్యలు, చిత్రహింసలు, అక్రమ నిర్బంధాలు, మానవాళికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఈ తీర్పు వెలువడింది. ఈ యుద్ధంలో సుమారు ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా.

అయితే ఈ తీర్పు అసద్‌, ఆయన సోదరుడు కోర్టుకు హాజరుకాకుండానే (in absentia) వెలువడింది. 2024 డిసెంబరులో తిరుగుబాటు దళాలు అధికారాన్ని కూల్చివేయడంతో అసద్‌ సిరియా నుంచి రష్యాకు పారిపోయారు. అనంతరం ఆయనకు రష్యా ఆశ్రయం కల్పించింది. ప్రస్తుతం అసద్‌, మహెర్‌ రష్యాలోనే ఉన్నారు.

సిరియా రాజకీయ చరిత్రలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన మాజీ అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌, ఆయన సోదరుడికి స్థానిక న్యాయస్థానం మరణదండన విధించింది. డమాస్కస్‌లోని నాలుగో క్రిమినల్‌ కోర్టు మంగళవారం ఈ సంచలన తీర్పును వెలువరించింది.

సిరియాలో సంవత్సరాల పాటు కొనసాగిన భీకర అంతర్యుద్ధం సమయంలో సామాన్య ప్రజలపై జరిగిన అమానుష దాడులు, హింస, యుద్ధ నేరాలకు సంబంధించి వీరిద్దరిపై నమోదైన ఆరోపణల నేపథ్యంలో కోర్టు ఈ కఠిన శిక్ష విధించినట్లు తెలిపింది. ఈ తీర్పుతో సిరియా రాజకీయాల్లో మరో కీలక అధ్యాయం తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అసద్‌ కుటుంబం దాదాపు ఐదు దశాబ్దాల పాటు సిరియాపై ఆధిపత్యం కొనసాగించింది. అయితే దేశంలో సుమారు 14 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ అంతర్యుద్ధం ఆ పాలనకు తీవ్ర సవాల్‌గా మారింది. ఈ కాలంలో అసద్‌ ప్రభుత్వం యుద్ధ నేరాలు, మానవాళికి వ్యతిరేకమైన చర్యలకు పాల్పడినట్లు కోర్టు పేర్కొంది.

సుదీర్ఘంగా కొనసాగిన ఘర్షణలు, హింసాత్మక దాడుల కారణంగా సుమారు ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది. అమాయక ప్రజలపై జరిగిన ఈ హింసాకాండ తీవ్ర ఆందోళన కలిగించే అంశమని కోర్టు అభిప్రాయపడింది.