
D Spiritual: Aug 12: చౌటకూర్లో ఘనంగా కట్టమైసమ్మ బోనాల ఉత్సవాలు
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో కట్టమైసమ్మ దేవత బోనాల ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బోనాలను నెత్తిన ఎత్తుకుని ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మొక్కులు చెల్లించుకుని, కట్టమైసమ్మ దేవత ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు.
ఆషాఢ మాసంలో కట్టమైసమ్మ దేవతను కొలవడం ఆనవాయితీగా వస్తోందని, ప్రతి ఏడాది బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని రజక సంఘం సంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగమయ్య తెలిపారు. బోనాల సందర్భంగా మహిళలు భక్తి పాటలు పాడుతూ ఉత్సాహంగా పాల్గొనడంతో చౌటకూర్లో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో చౌటకూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు చంద్రయ్య, సంఘం నాయకులు జోగయ్య, బాబు, వెంకటేశం, నర్సింలు, సోమయ్యతో పాటు రజక సంఘం మహిళలు, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
