
D Spiritual: Aug 11: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యాలను మరింత మెరుగుపరిచేందుకు కొత్త వసతులు అందుబాటులోకి రానున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ఆధునిక హంగులతో నిర్మించిన లడ్డూ పోటు, అన్నప్రసాద కేంద్రం భవనాలను ఈ నెల 21న లాంఛనంగా ప్రారంభించనున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నాటికి ఈ రెండు భవనాలను పూర్తిస్థాయిలో భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు.
అన్నదాన భవనాన్ని రూ.26 కోట్ల వ్యయంతో రెండు అంతస్తుల్లో నిర్మించగా, మహాప్రసాద భవనాన్ని రూ.27 కోట్లతో ఐదు అంతస్తుల్లో అత్యాధునిక ప్రమాణాలతో నిర్మించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తులకు నాణ్యమైన భోజనం, రుచికరమైన లడ్డూ ప్రసాదం ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగంగా అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్మాణాలను చేపట్టారు.
ఇంద్రకీలాద్రిపై నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ రెండు ఆధునిక భవనాలకు దేవాదాయ శాఖ అధికారులు పేర్లను ఖరారు చేశారు. అన్నదాన భవనానికి ‘శ్రీ కనకదుర్గ అన్నప్రసాద సదరం’ అని, ప్రసాదాల తయారీ భవనానికి ‘శ్రీ దుర్గాభవానీ మహాప్రసాద భవనం’ అని నామకరణం చేశారు.
ఇప్పటివరకు అన్నప్రసాదాన్ని ఆలయానికి వెలుపల ప్రాంతాల్లో తయారు చేసి ఇంద్రకీలాద్రికి తీసుకువచ్చి భక్తులకు అందించేవారు. కొత్త అన్నప్రసాద భవనం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆలయ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసిన ఆధునిక వంటశాలలో వేడివేడిగా భోజనాన్ని తయారు చేసి భక్తులకు వడ్డించనున్నారు. భక్తులు ప్రశాంతంగా కూర్చుని భోజనం చేసేలా ఈ భవనంలో ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేశారు.
అదేవిధంగా శ్రీ దుర్గాభవానీ మహాప్రసాద భవనంలోని ప్రత్యేక అంతస్తుల్లో నిత్యం లడ్డూలు, ఇతర ప్రసాదాలను పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేయనున్నారు. భక్తుల నుంచి ఆలయ సేవలపై అభిప్రాయాలను ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అభిప్రాయాల ఆధారంగా గత రెండు నెలలుగా దుర్గమ్మ ఆలయ సేవలు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు.
ఈ నెల 21న ప్రారంభం కానున్న కొత్త భవనాల్లో ప్రస్తుతం రంగుల పనులతో పాటు చిన్నచిన్న ఫినిషింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సమయంలో దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో వారి రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు నిర్మాణాలను పకడ్బందీగా పూర్తి చేస్తున్నారు.
తాగునీరు, పారిశుద్ధ్యం, దర్శన సౌకర్యాలు, నాణ్యమైన ప్రసాదం, అన్నదానం వంటి అన్ని విభాగాల్లో భక్తులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆలయ పాలకమండలి చర్యలు చేపడుతోంది. ఈ రెండు ప్రతిష్టాత్మక భవనాలు అందుబాటులోకి రావడంతో ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు లభించనున్నాయి. భక్తుల సౌకర్యమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలపై భక్తుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
