ప్రముఖ గాయకుడు, బిగ్‌బాస్ తెలుగు విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌పై విశాఖపట్నంలో కేసు నమోదైంది. తన స్నేహితుడికి సంబంధించిన వివాదంలో రాహుల్ సిప్లిగంజ్ ప్రమేయం ఉందని, తనను బెదిరించారని ఓ యువతి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాహుల్ సిప్లిగంజ్ స్నేహితుడు కర్పూరపు రాహుల్ రెడ్డి ఓ యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. తనను పెళ్లి చేసుకోవాలని యువతి ప్రశ్నించడంతో.. తమ మధ్య ఏకాంతంగా గడిపిన సమయంలో తీసిన వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేస్తానంటూ రాహుల్ రెడ్డి బెదిరించినట్లు బాధితురాలు ఆరోపించింది. ఈ నేపథ్యంలో మార్చి 10న ఆమె విశాఖ సీపీని కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

అనంతరం ఎంవీపీ పోలీస్ స్టేషన్‌లో రాహుల్ రెడ్డితో పాటు గాయకుడు రాహుల్ సిప్లిగంజ్, మరికొందరిపై యువతి ఫిర్యాదు చేసింది. రాహుల్ రెడ్డిని పెళ్లి చేసుకోవాలని తాను కోరిన సమయంలో.. రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు మరికొందరు తనను బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది.

ఈ కేసును తదుపరి దర్యాప్తు కోసం ఎంవీపీ పోలీసులు ఎండాడ మహిళా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. అయితే ఈ వివాదంలో మరో ఆరోపణ కూడా తెరపైకి వచ్చింది. సదరు యువతి రాహుల్ రెడ్డి నుంచి రూ.కోటి డిమాండ్ చేసిందని, ఆ మొత్తాన్ని ఇవ్వకపోవడంతోనే ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని మరోవైపు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఇరువర్గాల నుంచి వచ్చిన ఆరోపణలను పరిశీలిస్తున్న పోలీసులు.. కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి విచారణ అనంతరం వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.