
D News: Aug 10: గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల తల్లిదండ్రులకు హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS–నిమ్స్) శుభవార్త అందించింది. ఆగస్టు 13 నుంచి చిన్నారులకు పూర్తిగా ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ వెల్లడించారు. గత ఐదేళ్లుగా ప్రతి ఏడాది నిమ్స్ ఆధ్వర్యంలో ఉచిత పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
నిమ్స్ కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగం హెచ్‌ఓడీ ప్రొఫెసర్ అమరేశ్వర్ నేతృత్వంలో ఈ శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. లండన్‌కు చెందిన ప్రముఖ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమణ తన్నషునేని, లండన్ వైద్యుల బృందం, సాంకేతిక నిపుణులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. అంతర్జాతీయ నిపుణుల సహకారంతో చిన్నారులకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ ఉచిత శస్త్రచికిత్సల కోసం ముందస్తు అపాయింట్‌మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులను తల్లిదండ్రులు నేరుగా నిమ్స్ ఆసుపత్రికి తీసుకురావచ్చు. వాక్-ఇన్ విధానంలో చిన్నారులను ప్రాధాన్యత ఆధారంగా వైద్యులు పరిశీలిస్తారు. ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం శస్త్రచికిత్స అవసరమైన పిల్లలను ఎంపిక చేస్తారు.
తల్లిదండ్రులు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య నిమ్స్ ఆసుపత్రిని సంప్రదించవచ్చు. పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రి పాత బ్లాక్ మొదటి అంతస్తులో ఉన్న సీటీ సర్జరీ కార్యాలయానికి వెళ్లాలి.
చిన్నారులకు గతంలో చేయించిన వైద్య పరీక్షల నివేదికలు, పాత మెడికల్ రికార్డులు ఏమైనా ఉంటే తప్పనిసరిగా వెంట తీసుకురావాలని వైద్యులు సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా గుండె సమస్యలతో బాధపడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలు అందుబాటులోకి రానున్నాయి.
