
D News: Aug 10: సామాన్యుల సొంతింటి కలను సాకారం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ సహకార బ్యాంకుల్లో హోం లోన్ల నిబంధనలను సులభతరం చేస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు తక్కువ వడ్డీ రేట్లకు మరింత పెద్ద మొత్తంలో గృహ రుణాలు పొందే అవకాశం కలగనుంది. ఇప్పటివరకు ఈ బ్యాంకుల్లో రుణ పరిమితులు తక్కువగా ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మధ్యతరగతి కుటుంబాలకు తాజా మార్గదర్శకాలు ఊరటనిచ్చే అంశంగా మారాయి.
కొత్త నిబంధనల ప్రకారం గ్రామీణ సహకార బ్యాంకుల్లో డిపాజిట్ల స్థాయిని బట్టి గృహ రుణాల పరిమితిని గణనీయంగా పెంచారు. ఇకపై బ్యాంకుల డిపాజిట్ల పరిమాణాన్ని బట్టి రూ.60 లక్షల నుంచి రూ.3 కోట్ల వరకు హోం లోన్లు మంజూరు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రూ.1,000 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్న సహకార బ్యాంకులు తమ పరిధిలోని అర్హత కలిగిన ఖాతాదారులకు గరిష్ఠంగా రూ.3 కోట్ల వరకు గృహ రుణం అందించవచ్చు.
పెద్ద మొత్తంలో గృహ రుణాలు తీసుకునే వారికి రుణాన్ని తిరిగి చెల్లించేందుకు తగినంత సమయం కూడా కల్పించారు. రూ.1,000 కోట్లకు పైగా డిపాజిట్లు కలిగిన గ్రామీణ సహకార బ్యాంకుల నుంచి తీసుకునే గృహ రుణాలకు గరిష్ఠంగా 20 ఏళ్ల వరకు రీపేమెంట్ కాలపరిమితి ఉండనుంది. దీంతో రుణగ్రహీతలు తమ ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా నెలవారీ వాయిదాలను చెల్లించే అవకాశం ఉంటుంది.
అంతేకాకుండా నిర్మాణంలో ఉన్న ఇళ్ల కోసం ప్రత్యేకంగా 24 నెలల వరకు మారటోరియం సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. అంటే నిర్ణీత నిబంధనలకు లోబడి నిర్మాణ దశలో ఉన్న ఇంటి రుణానికి కొంతకాలం పాటు చెల్లింపుల నుంచి వెసులుబాటు లభించే అవకాశం ఉంటుంది. ఈ మార్పులు గ్రామీణ ప్రాంతాల్లో సొంతింటి నిర్మాణం లేదా కొనుగోలు చేయాలనుకునే ప్రజలకు మరింత సౌకర్యాన్ని కల్పించనున్నాయి.
