మెడికవర్ ఇండియా ఆస్పత్రుల వ్యాపారాన్ని దిగ్గజ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ కేకేఆర్ కొనుగోలు చేసింది. దాదాపు రూ. 10 వేల కోట్ల విలువైన ఈ ఒప్పందంతో పాటు సంస్థ విస్తరణ కోసం మరో భారీ పెట్టుబడి పెట్టనుంది. దీంతో ఇండియా హెల్త్ కేర్ సెక్టార్‌లో కేకేఆర్ ఉనికి మరింత బలపడనుందని చెప్పొచ్చు. ఈ డీల్ పూర్తి వివరాల్ని తెలుసుకుందాం.

ప్రపంచ దిగ్గజ పెట్టుబడి సంస్థ కేకేఆర్ (కోల్‌బర్గ్ క్రేవిస్ రాబర్ట్స్ అండ్ కో) స్వీడన్‌కు చెందిన హెల్త్‌కేర్ అండ్ డయాగ్నోస్టిక్స్ కంపెనీ మెడికవర్ ఏబీ నుంచి మెడికవర్ ఇండియా ఆస్పత్రుల వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని గురువారం రోజు అధికారికంగా ప్రకటించింది. ఈ ఒప్పందం విలువను కంపెనీలు వెల్లడించలేదు. అయితే మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ఈ డీల్ సుమారు రూ. 10 వేల కోట్లుగా ఉంటుందని తెలుస్తోంది. అంతేకాకుండా సంస్థ విస్తరణ కోసం కేకేఆర్ మరో రూ. 3 వేల కోట్ల నుంచి 4 వేల కోట్ల వరకు పెట్టుబడి పెట్టనుంది. మొత్తం మీద చూస్తే ఈ పెట్టుబడి విలువ రూ. 14 వేల కోట్లకుపైగానే (1.4-1.5 బిలియన్ డాలర్లు) ఉంటుంది.

ప్రస్తుతం మెడికవర్ ఇండియాకు 24 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు, సుమారు 4800 పడకలు ఉన్నాయి. 80కిపైగా వైద్య విభాగాల్లో సేవలు అందిస్తున్న ఈ సంస్థలో 1900 మందికిపైగా వైద్యులు ఉన్నారు. కేకేఆర్ ఇండియా ప్రైవేట్ ఈక్విటీ విభాగం హెడ్ అక్షయ్ తన్నా మాట్లాడుతూ- ‘మెడికవర్ ఇండియాలో వైద్య సేవల నాణ్యతను మరింత పెంచడంతో పాటు సాంకేతికత, మౌలిక సదుపాయాలు, ఆస్పత్రుల విస్తరణపై పెట్టుబడులు పెడతాం” అని తెలిపారు. దీంతో మరింత మందికి మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

By Ramya