
D News: Aug 4: హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహార పదార్థాల విక్రయాలపై హెచ్-ఫాస్ట్ (H-FAST) అధికారులు విస్తృత స్థాయిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, విశ్వసనీయ సమాచారం ఆధారంగా నగరంలోని పలు ప్రాంతాల్లో 13 మసాలా వ్యాపార, ప్రాసెసింగ్ కేంద్రాలపై మెరుపు దాడులు చేపట్టారు. ఈ తనిఖీల్లో 25.3 టన్నుల కల్తీ మసాలా దినుసులు, విక్రయానికి సిద్ధంగా ఉన్న 89.15 టన్నుల ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు.
మైలార్‌దేవ్‌పల్లి, బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల్లో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. కల్తీ ఆహార పదార్థాల తయారీ, విక్రయాలకు సంబంధించి మూడు క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
తనిఖీల్లో వాము, జీలకర్ర, లవంగం, షాజీరా, ఆవాలు వంటి నిత్యావసర మసాలా దినుసుల్లో ప్రమాదకరమైన రసాయనాలను కలుపుతున్నట్లు బయటపడింది. మసాలాలకు రంగు, మెరుపు, బరువు పెంచేందుకు ఫ్యాబ్రిక్ డైలు, సింథటిక్ కలర్స్, ఇండస్ట్రియల్ డైలు, టాల్కమ్ పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్‌తో పాటు హెయిర్ కలర్‌ను కూడా వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న నమూనాలను ప్రయోగశాల పరీక్షలకు పంపించినట్లు వెల్లడించారు.
కల్తీ మసాలాల వినియోగం వల్ల కాలేయం, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం పడటంతో పాటు క్యాన్సర్, అలర్జీలు, జీర్ణ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఆహార భద్రత చట్టం ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
హెచ్-ఫాస్ట్ వ్యవస్థ ప్రారంభమైన 140 రోజుల్లోనే మొత్తం 659 దాడులు నిర్వహించి, 202 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఇప్పటివరకు 246 టన్నుల కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కల్తీ ఆహార ముఠాలపై మరింత కఠిన చర్యల కోసం త్వరలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కల్తీ ఆహార పదార్థాలపై అనుమానం ఉన్న వారు వెంటనే హెచ్-ఫాస్ట్ హెల్ప్‌లైన్ నంబర్ 87126 61212కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలను కోరారు.
