
D Spiritual: Aug 4: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల ఉత్సవాల్లో పోతురాజు పాత్రకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. భక్తుల కోలాహలం, శివసత్తుల పూనకాలు, తొట్టెల ఊరేగింపులతో పాటు బోనాల వేడుకల్లో అందరి దృష్టిని ఆకర్షించే ప్రధాన ఆకర్షణ పోతురాజే. మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, మహంకాలమ్మ వంటి గ్రామదేవతల ఊరేగింపులో పోతురాజు ముందుండడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
పురాణాలు, జానపద కథనాల ప్రకారం పోతురాజును గ్రామదేవతలైన ఏడుగురు అక్కచెల్లెళ్లకు ఏకైక సోదరుడిగా భావిస్తారు. అమ్మవార్ల ఊరేగింపు సమయంలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా, దుష్టశక్తుల నుంచి రక్షణ కల్పించే బాధ్యతను పోతురాజు నిర్వహిస్తాడని భక్తుల విశ్వాసం. అందుకే బోనాల ఊరేగింపులో అమ్మవారి బోనం కంటే ముందుగా పోతురాజు నడుస్తూ ఊరేగింపుకు దారి చూపిస్తాడు.
పోతురాజు వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఒంటి నిండా పసుపు పూసుకుని, నుదుటిపై పెద్ద కుంకుమ బొట్టు ధరించి, కాళ్లకు గజ్జెలు, నడుముకు ఎరుపు లేదా రంగురంగుల వస్త్రం కట్టుకుంటాడు. చేతిలో కసాటగా పిలిచే తాళ్ల కొరడాను పట్టుకుని తన శరీరంపై కొట్టుకుంటూ ఉగ్రరూపంలో నాట్యం చేస్తాడు. ఈ శబ్దాలు, నాట్యం ద్వారా దుష్టశక్తులు పారిపోతాయని భక్తులు నమ్ముతారు.
ప్రాచీన కాలంలో గ్రామాల్లో కలరా, ప్లేగు, అమ్మవారు వంటి అంటువ్యాధులు వ్యాపించినప్పుడు గ్రామదేవతలను శాంతింపజేయడానికి పోతురాజు ముందుండి పూజలు నిర్వహించేవాడని జానపద విశ్వాసాలు చెబుతున్నాయి. పోతురాజు నృత్యం వల్ల గ్రామంపై ఉన్న పీడలు, దృష్టిదోషాలు, వ్యాధులు తొలగిపోతాయని ప్రజలు విశ్వసిస్తారు.
బోనాల ఉత్సవాల చివరి రోజున నిర్వహించే రంగం కార్యక్రమం, గావు పట్టడం వంటి సంప్రదాయ ఘట్టాల్లో కూడా పోతురాజు పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. తెలంగాణ జానపద సంస్కృతిలో వీరత్వం, ధైర్యం, గ్రామ రక్షణకు ప్రతీకగా పోతురాజు నిలిచిపోయాడు. అందుకే బోనాల పండుగలో పోతురాజు ప్రదర్శన భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించే ప్రధాన ఘట్టంగా భావిస్తారు.
