
D News: Aug 4: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నదికి వరద ప్రవాహం భారీగా పెరిగి శ్రీశైలం జలాశయంలోకి పోటెత్తుతోంది. ఐదు రోజుల క్రితం 820 అడుగులుగా ఉన్న నీటిమట్టం నిన్న సాయంత్రానికి 855.10 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం జలాశయంలో 92.048 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ఈ సాయంత్రానికి నిల్వలు 100 టీఎంసీల మార్కును చేరుకునే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
జూరాల ప్రాజెక్టు నుంచి సోమవారం 2.21 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయగా, రాత్రి సమయానికి శ్రీశైలం జలాశయానికి 1.55 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. రోజుకు లక్ష క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం మరో నాలుగు నుంచి ఐదు రోజుల పాటు కొనసాగవచ్చని శ్రీశైలం డ్యామ్ చీఫ్ ఇంజనీర్ కబీర్ బాషా తెలిపారు.
ఎగువ కర్ణాటకలోని ఆలమట్టి డ్యామ్‌లోకి 1,25,855 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, 1.50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే నారాయణపూర్ ప్రాజెక్టులోకి 1,28,954 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, 1,40,880 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
నారాయణపూర్ నుంచి విడుదలవుతున్న నీటికి భీమా నది వరద జలాలు తోడవడంతో జూరాల ప్రాజెక్టుకు 1.92 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. ఈ ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని జూరాల నుంచి 2,21,765 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు తుంగభద్ర జలాశయంలోకి 57,785 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
నాగార్జునసాగర్ జలాశయంలో ప్రస్తుతం 136 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, ఎగువ నుంచి 900 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టులో 28.91 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రకాశం బ్యారేజీలోకి 6,958 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, అందులో 6,499 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో వరద పరిస్థితులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
