
D News: Jul 28: తిరుపతిలో కరోనా కేసు.. రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తమైన వైద్యశాఖ
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి కరోనా కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో తాజాగా తొలి కోవిడ్-19 పాజిటివ్ కేసు వెలుగుచూసింది. ఎస్టీవీ నగర్‌కు చెందిన ఓ వృద్ధురాలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా, పరీక్షల్లో ఆమెకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. జూలై 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉన్న వారికి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 32 మంది అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా, నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ప్రస్తుతం 16 మంది వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, మరో 24 మంది హోం ఐసోలేషన్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని 14 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 11 కేసులు నమోదవగా, గుంటూరులో 9, వైఎస్సార్ కడప జిల్లాలో 8 కేసులు గుర్తించారు. విశాఖపట్నంలో 5, ఎన్టీఆర్ జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. కాకినాడ, ఏలూరు, బాపట్ల, పార్వతీపురం మన్యం జిల్లాల్లో రెండేసి కేసులు, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కృష్ణా, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు అధికారిక బులిటెన్ తెలిపింది.
ప్రతి జిల్లాలో కరోనా పాజిటివ్‌గా తేలిన వారి కాంటాక్ట్ ట్రేసింగ్ను అధికారులు వేగవంతం చేశారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, అవసరం లేని గుంపులు, రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో కొత్త కేసుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు వైద్య సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.
కోవిడ్ బాధితుల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ పడకలు, అవసరమైన మెడికల్ కిట్లు, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అనవసరంగా భయపడకుండా, లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యశాఖ సూచిస్తోంది.
