
D News: Jul 17: చాబహార్ పోర్టు: ఒమన్ గల్ఫ్‌లో ఉన్న చాబహార్ పోర్టు ఇరాన్‌కు మాత్రమే కాకుండా భారత్, ఆఫ్ఘనిస్థాన్‌తో పాటు మధ్య ఆసియా దేశాలకు అత్యంత కీలకమైన వాణిజ్య కేంద్రంగా గుర్తింపు పొందింది. అమెరికా తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో ఈ పోర్టులోని ప్రధాన నిఘా టవర్ ధ్వంసమైనట్లు సమాచారం. పోర్టులోకి వచ్చే వాణిజ్య నౌకల రాకపోకలను పర్యవేక్షించడంలో ఈ టవర్ కీలక పాత్ర పోషించేది. ఈ దాడికి సంబంధించిన చిత్రాలను అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా, ఇరాన్ మాత్రం ఈ నష్టాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. చాబహార్ పోర్టుపై అమెరికా దాడులు జరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం.
చాబహార్ పోర్టు అభివృద్ధిలో భారతదేశం కీలక భాగస్వామిగా ఉంది. పాకిస్థాన్‌ను దాటకుండా నేరుగా ఆఫ్ఘనిస్థాన్, మధ్య ఆసియా, రష్యా దేశాలకు సరకు రవాణా చేయడానికి ఈ పోర్టు భారత్‌కు వ్యూహాత్మకంగా ఎంతో కీలకం. ఈ మార్గం ద్వారా రవాణా వ్యయం సుమారు 60 శాతం వరకు తగ్గడమే కాకుండా సమయం కూడా ఆదా అవుతుంది. 2016లో కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం భారత్ ఈ పోర్టును వినియోగిస్తోంది. తాజా దాడుల నేపథ్యంలో ఈ వాణిజ్య మార్గంపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, హర్మూజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యాన్ని అడ్డుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దళాలు పలు వంతెనలపై వైమానిక దాడులు నిర్వహించాయి. దక్షిణ హోర్మోజ్గాన్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ దాడుల్లో ఏడుగురు మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తన పశ్చిమాసియా పొరుగు దేశాలపై క్షిపణి దాడులు ప్రారంభించింది. ముఖ్యంగా శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతార్‌తో పాటు బహ్రెయిన్, కువైట్‌లను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించినట్లు సమాచారం. దీంతో ఖతార్ తన వైమానిక రక్షణ వ్యవస్థలను అప్రమత్తం చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమయ్యాయి.
ఈ యుద్ధ వాతావరణం కారణంగా హర్మూజ్ జలసంధి గుండా జరిగే సముద్ర వాణిజ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడింది. ప్రపంచ సరకు రవాణాలో కీలకమైన ఈ మార్గంలో నౌకల రాకపోకలు దాదాపు పావు వంతు తగ్గినట్లు లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో అనేక చమురు ట్యాంకర్లు తమ లొకేషన్ ట్రాకింగ్ వ్యవస్థలను నిలిపివేసి ప్రయాణిస్తుండగా, మరికొన్ని నౌకలు ప్రయాణాలను నిలిపివేశాయి. అమెరికా ఆంక్షలను ధిక్కరించి ప్రయాణించే నౌకలను అమెరికా దళాలు దారి మళ్లించడం లేదా నిలిపివేయడం జరుగుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
