D News: Jul 16: అమెరికాలో భారతీయుడిపై కత్తితో దాడి.. మతం పేరుతో దారుణ ఘటన

అమెరికాలోని ఉటా రాష్ట్రంలో మత విద్వేషంతో జరిగిన దాడి తీవ్ర కలకలం రేపింది. వెస్ట్ వ్యాలీ సిటీలోని వ్యాలీ ఫెయిర్ మాల్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్న భారతీయుడు సయ్యద్ సోహైలుద్దీన్‌పై ఓ వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటన స్థానికంగా ఆందోళనకు దారితీయగా, పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం, సోమవారం మధ్యాహ్నం మాల్‌కు వచ్చిన 48 ఏళ్ల పీటర్ మైఖేల్ లార్సన్ అనే వ్యక్తి ముందుగా సోహైలుద్దీన్‌ను “నీ పేరు ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చావు? నీ మతం ఏంటి?” అంటూ ప్రశ్నించాడు. అనంతరం తన వద్ద ఉన్న కత్తితో ఒక్కసారిగా దాడికి పాల్పడి, సుమారు 15 సార్లు పొడిచినట్లు అధికారులు తెలిపారు.

ఈ దారుణాన్ని గమనించిన అక్కడి స్థానికులు వెంటనే స్పందించి నిందితుడిని అడ్డుకున్నారు. అతడి చేతిలోని కత్తిని లాక్కొని పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో నిందితుడు లార్సన్ తలకు కూడా గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన సోహైలుద్దీన్‌ను అత్యవసరంగా ఆస్పత్రికి తరలించగా, వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ట్రామా విభాగంలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. తీవ్ర గాయాల నుంచి ఆయన ప్రాణాలతో బయటపడటం అదృష్టమని కుటుంబ సభ్యులు తెలిపారు.

విచారణలో నిందితుడు బాధితుడి మత విశ్వాసాల కారణంగానే లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో అతనిపై హత్యాయత్నం, ప్రమాదకర ఆయుధాన్ని అక్రమంగా కలిగి ఉండటం తదితర అభియోగాల కింద కేసులు నమోదు చేసి సాల్ట్ లేక్ కౌంటీ మెట్రో జైలుకు తరలించారు. నిందితుడి తీవ్రవాద భావజాలాన్ని దృష్టిలో ఉంచుకుని అతనికి బెయిల్ మంజూరు చేయవద్దని దర్యాప్తు అధికారులు కోర్టును కోరారు.

ఈ ఘటనపై భారత కాన్సులేట్ కూడా స్పందించింది. బాధితుడికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నామని వెల్లడించింది. ఈ దాడి ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.