D News: Jul 16: బంగాళాఖాతంలో ఘోర విషాదం.. 500 మందికిపైగా రోహింగ్యా శరణార్థులు మృతి చెందివుండొచ్చని అంచనా

మయన్మార్‌కు చెందిన రోహింగ్యా శరణార్థుల ప్రయాణం మరోసారి ఘోర విషాదానికి దారితీసింది. బంగాళాఖాతంలో వేర్వేరు ప్రాంతాల్లో ప్రయాణిస్తున్న రెండు పడవలు మునిగిపోవడంతో 500 మందికిపైగా ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ (UNHCR), అంతర్జాతీయ వలసల సంస్థ (IOM) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలనే ఆశతో బయల్దేరిన వందలాది మంది శరణార్థులు ఈ ప్రమాదంలో గల్లంతయ్యారని అధికారులు భావిస్తున్నారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, జూన్ చివరి వారంలో మయన్మార్‌లోని రాఖైన్ రాష్ట్ర తీరం నుంచి సుమారు 250 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఒక పడవ సముద్రంలోకి వెళ్లిన కొద్దిసేపటికే బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయింది. అనంతరం జూలై 8న సుమారు 280 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న మరో పడవ అయేయార్వాడీ తీర ప్రాంతంలో మునిగిపోయినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది.

అంతర్జాతీయ వలసల సంస్థలు నిర్వహించిన ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఈ రెండు పడవల్లో ప్రయాణించిన మొత్తం 530 మందికిపైగా ప్రయాణికులు సముద్రంలో మునిగి మరణించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఘటన రోహింగ్యా శరణార్థులు సురక్షిత ఆశ్రయం కోసం ఎదుర్కొంటున్న తీవ్ర మానవతా సంక్షోభాన్ని మరోసారి ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది. ఈ విషాద ఘటనపై ఐక్యరాజ్యసమితి సంస్థలు అంతర్జాతీయ సమాజం తక్షణమే స్పందించి రోహింగ్యా శరణార్థుల రక్షణకు మరింత చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చాయి.