
D Spiritual: Jul 11: తిరుమల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేయడంపై దృష్టి సారించాయి. తిరుమల మాడ వీధులతో పాటు కొండ మొత్తం నిఘా వ్యవస్థను బలోపేతం చేస్తూ, అన్ని భద్రతా విభాగాలు సమన్వయంతో పనిచేసేలా ఏకీకృత విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించాయి.
తిరుమల భద్రతకు టీటీడీతో పాటు ప్రభుత్వమూ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ఆడిట్ నిర్వహిస్తూ భద్రతా లోపాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. భక్తుల భద్రతకు పెద్దపీట వేస్తూనే, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. హాకర్లు, దుకాణాలు, హోటళ్లు, నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న వారి వివరాలను పోలీసులు నిరంతరం పరిశీలిస్తున్నారు. టీటీడీ లెక్కల ప్రకారం తిరుమలలో 1,229 దుకాణాలు ఉండగా, హాకర్ లైసెన్సులు 588 మాత్రమే ఉన్నాయి.
తిరుమలలోని దుకాణాలు, హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో బయటి ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 3 వేల మంది పనిచేస్తున్నట్లు అంచనా. వీరికి తిరుమలలో శాశ్వతంగా నివసించే అనుమతి లేకపోవడంతో ప్రతిరోజూ తిరుపతి నుంచి వచ్చి విధులు నిర్వహించి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. అయితే కొంతమంది భక్తుల మధ్య కలిసిపోయి టీటీడీ అనుమతి లేకుండా చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ అనధికారికంగా జీవిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి వారి సంఖ్య సుమారు వెయ్యి వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
అదే విధంగా అభివృద్ధి పనులు, భవన నిర్మాణాల్లో పనిచేసేందుకు బయటి ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికుల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. టీటీడీతో సంబంధం లేకుండా తిరుమలలో నివసిస్తూ ఇతర గుర్తింపు పత్రాలు పొందిన వారి వివరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి కొండపై నుంచి పంపించే చర్యలు కొనసాగుతున్నాయి.
మాడ వీధులు సహా రద్దీ ప్రాంతాల్లో హాకర్ లైసెన్సులు లేకుండా వ్యాపారాలు చేస్తున్న వారిని గుర్తిస్తున్నారు. దుకాణాలు, హోటళ్లు, నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న వారి గుర్తింపు వివరాలను సేకరిస్తూ, సరైన ఆధారాలు చూపలేని వారిపై చర్యలు తీసుకుంటున్నారు. అలాగే అనుమానాస్పద వ్యక్తులను ఉద్యోగాల్లో నియమించుకునే షాప్ యజమానులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రతి దుకాణం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం తప్పనిసరి చేస్తూ, తిరుమల అంతటా నిఘా కెమెరాల సంఖ్యను పెంచి నిరంతర పర్యవేక్షణ కొనసాగించేలా చర్యలు చేపడుతున్నారు.
