D News: Jul 10: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరోసారి ఎగబాకుతున్నాయి. దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగే అవకాశాలపై చర్చ మొదలైంది. భారత్ తన అవసరాల్లో ఎక్కువ భాగం ముడి చమురును దిగుమతుల ద్వారానే సమకూర్చుకుంటుండటంతో అంతర్జాతీయ ధరల పెరుగుదల దేశీయ ఇంధన ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో గల్ఫ్ ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు కొనసాగుతుండగా, అమెరికా కూడా ఎదురుదాడులు చేపడుతోంది. ఇటీవల ఉద్రిక్తతలు తగ్గడంతో ముడి చమురు ధరలు కాస్త తగ్గినా, తాజా పరిణామాల నేపథ్యంలో అవి మళ్లీ పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే బ్యారెల్‌కు ముడి చమురు ధర 75 డాలర్లకు పైగా చేరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదే సమయంలో ముడి చమురు అమ్మకాలపై ఇరాన్‌కు ఇచ్చిన తాత్కాలిక మినహాయింపును అమెరికా ఉపసంహరించుకుని ఆంక్షలను మళ్లీ అమల్లోకి తీసుకొచ్చింది. ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి సమీపంలో ముడి చమురు, ఎల్‌ఎన్‌జీ ట్యాంకర్లపై దాడులు జరుగుతుండటంతో సరఫరా వ్యవస్థకు అంతరాయం కలిగే ప్రమాదం నెలకొంది. ఈ ఆందోళనల నేపథ్యంలో బ్రెంట్ ముడి చమురు ధరలు దాదాపు 6 శాతం పెరిగి బ్యారెల్‌కు 78 డాలర్లకు చేరుకోగా, అమెరికా క్రూడ్ ఆయిల్ ధర 74 డాలర్లకు పైగా ట్రేడవుతోంది.

ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు కొనసాగితే భారత ముడి చమురు బాస్కెట్ ధర కూడా ప్రస్తుతం ఉన్న బ్యారెల్‌కు 68 డాలర్ల నుంచి 75 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. హోర్ముజ్ జలసంధి ద్వారా ఇంధన ట్యాంకర్ల రవాణా కూడా గణనీయంగా తగ్గినట్లు సమాచారం. దీంతో చమురు దిగుమతుల వ్యయం పెరిగి రూపాయిపై ఒత్తిడి పెరగడంతో పాటు ద్రవ్యోల్బణం కూడా అధికమయ్యే అవకాశం ఉంది.

ముడి చమురు ధరలు పెరిగితే చమురు మార్కెటింగ్ సంస్థలపై అదనపు భారం పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాల్సిన పరిస్థితి రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇంధన ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. యుద్ధ పరిస్థితులు ఎలా మారతాయనేదానిపైనే రానున్న రోజుల్లో చమురు ధరలు, దేశీయ ఇంధన ధరల దిశ ఆధారపడి ఉండనుంది.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana
పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana