
D Spiritual: May 2: తిరుమల వేంకటేశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి పౌర్ణమి సందర్భంగా గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
గరుడ వాహనం సర్వపాప ప్రాయశ్చిత్తంగా పౌరాణిక ప్రాధాన్యతను కలిగి ఉంది. 108 వైష్ణవ దివ్యదేశాలలో గరుడసేవకు అత్యంత ప్రాముఖ్యత ఉందని భావిస్తారు. గరుడు వాహనంపై స్వామివారు దర్శనమివ్వడం ద్వారా దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజేస్తారని భక్తులు విశ్వసిస్తారు. అలాగే జ్ఞానవైరాగ్య ప్రాప్తి కోరుకునే భక్తులు గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భావన ఉంది.
ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో సి. హెచ్. వెంకయ్య చౌదరి, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, డిప్యూటీ ఈవో లోకనాథం తదితర ఆలయ అధికారులు పాల్గొన్నారు.
