
DNews:28 Apr: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ (LMD) పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఒక అమానవీయ ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా కన్నపిల్లలను పోలీస్ స్టేషన్లోనే వదిలివెళ్లిన ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
తిమ్మాపూర్ మండలం అల్లనూరు గ్రామానికి చెందిన రవికుమార్, నిజామాబాద్‌కు చెందిన లలిత సుమారు పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే కొంతకాలంగా వీరి మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గొడవ పడిన దంపతులు స్టేషన్ వరకు వచ్చారు.
పోలీస్ స్టేషన్లో గొడవ జరుగుతుండగా, భార్య ఆవేశంతో తనకు భర్త, పిల్లలు ఎవరూ వద్దంటూ తన తాళిబొట్టు, మెట్టెలను పోలీసుల టేబుల్‌పై పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది.పోలీసులు వారిస్తున్నా వినకుండా, భర్త కూడా పిల్లలను తనకు వద్దంటూ అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు.తమ కళ్లముందే తల్లిదండ్రులు ఇద్దరూ వదిలివెళ్లడంతో ఆ చిన్నారులు “అమ్మ కావాలి” అంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఈ దృశ్యం అక్కడున్న పోలీసులను మరియు స్థానికులను కలచివేసింది.
చిన్నారుల పరిస్థితిని చూసి చలించిపోయిన ఎస్ఐ అన్వర్ మరియు సిబ్బంది తక్షణమే స్పందించారు. వెళ్లిపోయిన తల్లిదండ్రులను తిరిగి స్టేషన్‌కు రప్పించి వారికి సుదీర్ఘంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. పిల్లల భవిష్యత్తు గురించి, వారిని ఇలా వదిలేయడం వల్ల కలిగే పరిణామాల గురించి వివరించడంతో దంపతులు శాంతించారు. చివరకు తమ తప్పు తెలుసుకున్న తల్లిదండ్రులు పిల్లలను తీసుకుని ఇంటికి వెళ్లడంతో వివాదం ముగిసింది.
