
D Spiritual: Sep 22:హిందూ మత విశ్వాసాల ప్రకారం అష్టాదశ శక్తిపీఠాలు అత్యంత పవిత్రమైనవిగా పరిగణించబడుతున్నాయి.
‘అష్టాదశ’ అంటే 18. అయితే ఈ శక్తిపీఠాల సంఖ్యపై కొంత భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ, ప్రధానంగా 18 శక్తిపీఠాలనే స్వీకరించారు. దేవి నవరాత్రుల సందర్భంలో ఈ శక్తిపీఠాల విశిష్టత ఎంతో ప్రాధాన్యం పొందింది.
అష్టాదశ శక్తిపీఠాల ఉద్భవం పురాణ కథనం ప్రకారం ఇలా ఉంది.
దక్ష ప్రజాపతి నిర్వహించిన నిరీశ్వర యాగంలో సతీదేవిని అవమానించారు. శివుని అవమానాన్ని భరించలేక సతీదేవి అగ్నికి ఆహుతి అయ్యింది. దీనితో ఆగ్రహించిన పరమశివుడు సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకొని ముల్లోకాలను భయపెట్టేలా తాండవం చేశాడు. అప్పుడు శివుడి ఆగ్రహం శాంతింపజేయడానికి శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించాడు.
దాంతో సతీదేవి శరీరం 18 భాగాలుగా భూమిపై పడ్డాయి.
ఆ ప్రదేశాలే కాలక్రమంలో అష్టాదశ శక్తిపీఠాలుగా రూపుదిద్దుకుని, భక్తుల ఆరాధన పొందుతున్నాయి.
అష్టాదశ శక్తిపీఠాలు – వాటి ప్రదేశాలు మరియు విశిష్టత:
- శాంకరి దేవి – శ్రీలంక: తొడ భాగం లేదా హృదయ భాగం పడిందని నమ్మకం.
- కామాక్షి – కాంచీపురం: నాభి భాగం (కొంతమంది వీపు భాగమని అంటారు).
- శృంఖలా – ప్రద్యుమ్న నగరం, బెంగాల్: ఉదర భాగం.
- చాముండేశ్వరి – మైసూరు: కేశాలు.
- జోగులాంబ – అలంపురం: దంతాలు.
- భ్రమరాంబిక – శ్రీశైలం: మెడ భాగం.
- మహాలక్ష్మి – కొల్హాపూర్: నేత్రాలు.
- రేణుకాదేవి (ఏకవీరికా) – మాహుర్, మహారాష్ట్ర: ఒక చేయి
- మహాకాళి – ఉజ్జయిని: పై పెదవి.
- పురుహూతికా – పిఠాపురం: పీఠ భాగం.
- గిరిజా దేవి – జాజిపుర్, ఒడిశా: నాభి ప్రదేశం.
- మాణిక్యాంబ – ద్రాక్షారామం: ఎడమ చెంప.
- కామాఖ్యా – గౌహతి, అస్సాం: యోని భాగం.
- మాధవేశ్వరి – ప్రయాగరాజ్: కుడి చేయి నాలుగు వేళ్లు.
- జ్వాలాముఖి – హిమాచల్ ప్రదేశ్: నాలుక.
- సర్వమంగళ – గయా, బీహార్: స్తనాలు.
- విశాలాక్షి – వారణాశి: చెవి కుండలాలు.
- శారదాపీఠం – కాశ్మీర్: కుడి చేయి.
ఈ 18 శక్తిపీఠాలలో 16 భారతదేశంలోనే ఉన్నాయి.
మిగిలిన రెండు – ఒకటి శ్రీలంకలో, మరొకటి పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్నాయి.
పురాణాల ప్రకారం ఈ 18 శక్తిపీఠాలను దర్శించినా, వినినా, వాటి గురించి చదివినా లేదా రాసినా కూడా పునర్జన్మలేని మోక్షాన్ని పొందుతారని నమ్మకం.
అందువల్ల నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ ఒక్కో శక్తిపీఠం విశేషాలను తెలుసుకోవడం అత్యంత శుభప్రదమని విశ్వాసం.
ఓం శ్రీ మాత్రే నమః!
