
DNews:18 Mar: రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
మొక్కజొన్న పంటకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, మార్కెట్‌లో దళారుల రాజ్యమేలుతోందని హరీశ్‌రావు మండిపడ్డారు. క్వింటాల్ మొక్కజొన్నకు ప్రభుత్వం ప్రకటించిన ధర లభించక రైతులు కళ్లాల్లోనే కన్నీరు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో తెరిచి, ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా, రుణమాఫీ వంటి హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చేతుల్లో మొక్కజొన్న కంకులు పట్టుకుని, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సాగిన ఈ ర్యాలీ అసెంబ్లీ పరిసరాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎండగడతామని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు.
