
D Spiritual: Mar 17: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానాలు శుభవార్త తెలియజేసింది. ప్రతీ నెల మాదిరిగానే జూన్ నెల దర్శనం టికెట్ల విడుదలపై స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు టికెట్ల విడుదల షెడ్యూల్ను ప్రకటించింది.
జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లను ఈ నెల 24వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి గదుల కోటాను విడుదల చేస్తారు.
వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారి కోసం ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్లను ఈ నెల 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. అలాగే శ్రీవారి ట్రస్టు దర్శనం టికెట్లు కూడా అదే రోజు ఉదయం 11 గంటలకు అందుబాటులోకి వస్తాయి.
అంగ ప్రదక్షిణ టికెట్లు ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. వర్చువల్ సేవ టికెట్లు ఈ నెల 21న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల అవుతాయి. అదే రోజున ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, జ్యేష్ఠాభిషేకం టికెట్లు విడుదల చేయనున్నారు.
సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించిన టికెట్లు మార్చి 18న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టిటిడి తెలిపింది.
ఎలక్ట్రానిక్ డిప్ కోసం మార్చి 20న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన భక్తులు మార్చి 20 నుంచి 22 మధ్యాహ్నం 12 గంటల్లోపు చెల్లింపులు పూర్తి చేస్తే టికెట్లు ఖరారు అవుతాయి. భక్తులు అధికారిక వెబ్సైట్ల ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలని టిటిడి సూచించింది.
