DSports 17Mar 2026:చెన్నై: ఐపీఎల్ 19వ సీజన్ కోసం సిద్ధమవుతున్న ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జేమ్స్ ఫోస్టర్‌ను ఫీల్డింగ్ కోచ్‌గా నియమిస్తూ ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. గత సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన సీఎస్కే, ఈసారి ఫీల్డింగ్‌ ప్రమాణాలను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించింది.

  • 45 ఏళ్ల జేమ్స్ ఫోస్టర్‌కు అంతర్జాతీయ మరియు ఫ్రాంచైజీ క్రికెట్‌లో కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది.గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు ఫీల్డింగ్ మరియు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశారు. ఇంగ్లండ్ మరియు న్యూజిలాండ్ జాతీయ జట్ల కోచింగ్ స్టాఫ్‌లో కూడా ఆయన భాగస్వామిగా ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ‘ఇంటర్నేషనల్ లీగ్ టీ20’ (ILT20)లో డెజర్ట్ వైపర్స్‌ జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టడంలో హెడ్ కోచ్‌గా కీలక పాత్ర పోషించారు.
  • జేమ్స్ ఫోస్టర్ ఇప్పుడు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ నేతృత్వంలోని కోచింగ్ బృందంలో చేరనున్నారు. ఇందులో ఇప్పటికే బ్యాటింగ్ కోచ్‌గా మైకేల్ హస్సీ, బౌలింగ్ కోచ్‌గా ఎరిక్ సిమన్స్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ముఖ్యంగా వికెట్ కీపర్ అయిన ఫోస్టర్, ఎంఎస్ ధోనీ మరియు కొత్తగా జట్టులోకి వచ్చిన సంజు శాంసన్‌ వంటి కీపర్లతో కలిసి పని చేయనుండటం విశేషం.