
D Spiritual: Mar 13: శ్రీవేంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఒక ముఖ్యమైన శుభవార్తను అందించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు తిరుమల కొండపైకి వెళ్లి మాత్రమే కొనుగోలు చేయగలిగే శ్రీవారి బంగారు, వెండి డాలర్లను ఇకపై ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ కొత్త విధానాన్ని అమలు చేయడానికి ట్రెజరీ, జువెలరీ విభాగాలు మరియు బ్యాంకు అధికారులతో ఇప్పటికే ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నారు.
ఈ సరికొత్త విధానం అమల్లోకి వస్తే భక్తులు తమ ఇళ్ల నుంచే ఆన్లైన్లో శ్రీవారి డాలర్లను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. బుక్ చేసిన డాలర్లను పోస్టల్ సేవల ద్వారా దేశవ్యాప్తంగా భక్తుల ఇళ్లకు పంపించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం తిరుమలలోని కౌంటర్లలో 2, 5, 10 గ్రాముల బంగారు డాలర్లు మరియు 5, 10, 50 గ్రాముల వెండి డాలర్లు విక్రయిస్తున్నారు.
సామాన్య భక్తులకు కూడా సులభంగా అందుబాటులో ఉండేలా 1 గ్రాము నుంచి 10 గ్రాముల వరకు కొత్త రకాల డాలర్లను తయారు చేయాలనే ఆలోచనలో టీటీడీ ఉంది. ముఖ్యంగా తక్కువ ధరలో బంగారం పూత పూసిన వెండి డాలర్లను కూడా విక్రయించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు.
అయితే బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తరచూ మారుతున్న నేపథ్యంలో డాలర్ల ధరల నిర్ణయంపై టీటీడీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ప్రస్తుతం వారానికి ఒకసారి ధరలను నిర్ణయిస్తున్నప్పటికీ, భవిష్యత్తులో రోజువారీ ధరల ఆధారంగా విక్రయాలు నిర్వహించే యోచనలో ఉంది. బయటి మార్కెట్ కంటే ధర తక్కువగా ఉంటే డిమాండ్ ఎక్కువయ్యే అవకాశం ఉన్నందున, ఈ డాలర్ల విక్రయాన్ని దర్శన టికెట్లు ఉన్న భక్తులకే పరిమితం చేయాలా లేదా కొన్ని ప్రత్యేక నిబంధనలు విధించాలా అనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది. ఈ ఆన్లైన్ విక్రయాలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే టీటీడీ అధికారికంగా ప్రకటించనుంది.
