
D Spiritual: Mar 6: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మార్చి 19న ‘ఉగాది ఆస్థానం’ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సర్వం సిద్ధం చేస్తోంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించనున్నారు.
మార్చి 17న (మంగళవారం) ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి వంటి ప్రధాన పండుగలకు ముందు వచ్చే మంగళవారాల్లో ఈ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం టీటీడీలో అనాదిగా వస్తున్న ఆచారం.
ఈ నేపథ్యంలో మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవలను టీటీడీ రద్దు చేసింది. దీని కారణంగా మార్చి 16న ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన వారికి వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.
అదేవిధంగా ఉగాది పర్వదినం సందర్భంగా కూడా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా సాధారణ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. అందువల్ల మార్చి 18న సిఫార్సు లేఖలు సమర్పించే అవకాశం ఉండదు.
