
D Spiritual: Mar 6: అస్సాం రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి మరియు ప్రాయోజిత సంక్షేమ కార్యక్రమాల అమలు వేగంగా కొనసాగుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో గత ఐదేళ్లలో అస్సాంలో తీవ్రవాద ప్రభావం గణనీయంగా తగ్గిందన్నారు. దాదాపు 10 వేల మంది ఉల్పా తీవ్రవాదులు సాధారణ జనజీవన స్రవంతిలో కలిసిపోయారని చెప్పారు. లొంగిపోయిన వారికి అందిస్తున్న పునరావాస కార్యక్రమాలపై పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు మరియు పెట్టుబడుల వివరాలపై కూడా కేంద్ర మంత్రి సమీక్షించారు. గత ఐదేళ్లలో ఒక్క ఫిర్యాదు కూడా లేకుండా మొత్తం 1 లక్షా 51 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి అజయ్ తివారీ వెల్లడించారు. మైనింగ్ రంగంలో చేపట్టిన సంస్కరణల వల్ల దేశంలో అస్సాం రాష్ట్రం నంబర్ వన్‌గా నిలిచిందన్నారు. గతంతో పోలిస్తే ప్రభుత్వ సిబ్బంది పనితీరులో కూడా గణనీయమైన మార్పు వచ్చిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాల వల్లే అస్సాం రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాల్లో పురోగతి కనిపిస్తోందని తెలిపారు.
ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గురువారం అస్సాం రాష్ట్ర రాజధాని గువాహటి లోని రాష్ట్ర అతిథి గృహంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని దిమా హసావో జిల్లాలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల పనితీరుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేపట్టారు.
అదే రోజు ఉదయం గువాహటిలోని ప్రసిద్ధ శక్తిపీఠం కామాఖ్య దేవి ఆలయాన్ని కేంద్ర మంత్రి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గర్భగుడిలో కామాఖ్య అమ్మవారిని దర్శించుకుని ఆలయ పండితుల ఆశీర్వచనం అందుకున్నారు.
కాగా శుక్రవారం ఉదయం గువాహటి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి దిమా హసావో జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అక్కడ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రాయోజిత పథకాల పనితీరు మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు.
