
DNews:05 Mar: హన్మకొండ జిల్లాలో హిస్సార్ ఎక్స్ప్రెస్కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ రోజు తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో రైలు ఇంజిన్ చక్రం విరిగిపోవడంతో పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నప్పటికీ, లోకో పైలట్ అప్రమత్తతతో ముప్పు తప్పింది.
హిస్సార్ నుంచి సికింద్రాబాద్ వైపు వందలాది మంది ప్రయాణికులతో వెళ్తున్న హిస్సార్ ఎక్స్ప్రెస్, హన్మకొండ జిల్లా ఉప్పల్ రైల్వే స్టేషన్ సమీపంలోని మడిపల్లి గేట్ వద్దకు రాగానే ఒక్కసారిగా రైలు ఇంజిన్ చక్రం విరిగిపోయింది. సాంకేతిక లోపాన్ని గమనించిన లోకో పైలట్ వెంటనే రైలును నిలిపివేయడంతో వందలాది మంది ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. పట్టా విరిగిందా లేక ఇంజిన్ చక్రంలోనే లోపం ఉందా అన్నది నిర్ధారించాల్సి ఉంది.
ఈ ప్రమాదం కారణంగా రైలు దాదాపు నాలుగు గంటల పాటు నిర్మానుష్య ప్రాంతంలోనే నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు, ముఖ్యంగా వృద్ధులు మరియు పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు కాజీపేట నుంచి మరో ఇంజిన్ను రప్పించి, దాని సహాయంతో రైలును నెమ్మదిగా ఉప్పల్ రైల్వే స్టేషన్కు తరలించారు. అనంతరం అక్కడ సాంకేతిక మరమ్మతులు పూర్తి చేసిన తర్వాత రైలును గమ్యస్థానానికి పంపే ఏర్పాట్లు చేశారు. రైల్వే ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
