
DNews: Mar 02: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్) నుండి పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం కారణంగా ఎయిర్ ఇండియా, ఇండిగో, ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్‌వేస్ వంటి ప్రముఖ ఎయిర్‌లైన్స్ ఈ నిర్ణయం తీసుకున్నాయి. దోహా, అబుదాబి, జెడ్డా, సౌదీ అరేబియా, కువైట్, దుబాయ్, మస్కట్, మదీనా వంటి గమ్యస్థానాలకు వెళ్లే విమానాలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. మొత్తం 22 బయలుదేరే విమానాలు, 22 వచ్చే విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులతో కిక్కిరిసే శంషాబాద్ విమానాశ్రయం ఇప్పుడు ఖాళీగా మారబోతోంది. ఈ పరిస్థితుల్లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక సూచనలు జారీ చేసింది. మధ్యప్రాచ్య దేశాలకు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని, అలాగే ప్రయాణికులు తమ విమానాల స్థితిని ఎయిర్‌లైన్ వెబ్‌సైట్లు లేదా విమానాశ్రయ అధికారుల ద్వారా తప్పనిసరిగా తనిఖీ చేయాలని DGCA సూచించింది.
