
DNews:02 Mar: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి అల్లర్ల కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కస్టడీ పిటిషన్‌పై విచారణను జిల్లా కోర్టు ఈ నెల 5వ తేదీకి (మార్చి 5, 2026) వాయిదా వేసింది. క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సమయంలో మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి చేసినట్లు నమోదైన కేసులో సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా, ప్రస్తుతం ఆయన ఆదిలాబాద్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అంతకుముందు మంచిర్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు పోలీసుల కస్టడీ పిటిషన్‌ను కొట్టివేయగా, ఆ తీర్పును సవాలు చేస్తూ పోలీసులు జిల్లా కోర్టులో అప్పీల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి విచారణను మార్చి 5కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
మరోవైపు బాల్క సుమన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై కూడా విచారణ కొనసాగుతోంది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై అక్రమ కేసులు పెట్టారని, అరెస్ట్ సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని ఆయన తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. ఈ బెయిల్ పిటిషన్‌పై కోర్టు నేడు తీర్పు వెల్లడించే అవకాశం ఉండటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
