
D Spiritual: Feb 21: అమలకి ఏకాదశి 2026
ఫాల్గుణ మాస శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని అమలకి లేదా ఆమ్లకీ ఏకాదశి అని పిలుస్తారు. 2026 సంవత్సరంలో ఈ ఏకాదశి తిథి ఫిబ్రవరి 26 అర్థరాత్రి 12:33 గంటలకు ప్రారంభమై, ఫిబ్రవరి 27 రాత్రి 10:32 గంటలకు ముగుస్తుంది. సూర్యోదయ సమయానికి ఉన్న తిథి ప్రకారం ఈసారి ఫిబ్రవరి 27, శుక్రవారం అమలకి ఏకాదశిగా పరిగణించబడుతుంది.
ఈ రోజున ఉపవాసం చేసి భక్తితో పూజలు చేస్తే శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో పాటు మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ముఖ్యంగా ఉసిరి చెట్టు (ఆమ్లా చెట్టు) వద్ద దీపం వెలిగించి లక్ష్మీనారాయణులను ఆరాధించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
అమలకి ఏకాదశి రోజున ఉసిరి చెట్టుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ చెట్టును నారాయణుడి స్వరూపంగా భావించి పూజిస్తే కష్టాలు తొలగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఉసిరి చెట్టును దర్శించడం వల్ల పాపాలు తగ్గుతాయని, దానిని తాకడం ద్వారా గ్రహబాధలు తగ్గుతాయని నమ్మకం. భక్తితో ఆరాధించిన వారికి పాప విమోచనం కలిగి మోక్షం సిద్ధిస్తుందని విశ్వసిస్తారు.
ఈ రోజు ఉసిరి కాయలను దానం చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని భావిస్తారు. అనారోగ్య సమస్యలు తగ్గి ఆయురారోగ్యాలు పెరుగుతాయని, సంపద, దీర్ఘాయుష్షు, మానసిక ప్రశాంతత లభిస్తాయని భక్తులు నమ్ముతారు. ఉసిరి చెట్టు పూజ వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని కూడా చెబుతారు.
పూజా విధానంలో భాగంగా బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి, ఇంటి పూజా గదిని శుభ్రపరచి విష్ణువు చిత్రం లేదా విగ్రహాన్ని ప్రతిష్టించాలి. ఇంటి వద్ద ఉసిరి చెట్టు లేదా మొక్క ఉంటే దాని కిందనే విష్ణువు పటాన్ని ఉంచి పూజ చేయవచ్చు. సంకల్పం చేసి “ఓం నమో నారాయణాయ” మంత్రాన్ని జపించాలి. తులసి దళాలు, పూలు, అక్షతలు, కుంకుమతో లక్ష్మీనారాయణులను ఆరాధించి, ఉసిరి కాయలను నైవేద్యంగా సమర్పించాలి. విష్ణు సహస్రనామం, అష్టోత్తర శతనామావళి పారాయణం చేసి దీప, ధూప, నైవేద్యాలతో పూజను పూర్తి చేయాలి.
ఏడాదిలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశికి ప్రత్యేకత ఉన్నప్పటికీ ఉపవాస నియమాలు సాధారణంగా ఒకే విధంగా ఉంటాయి. దశమి రాత్రి నుంచే నియమాలు ప్రారంభించి, ఏకాదశి రోజంతా ఉపవాసం పాటించి ద్వాదశి తిథి ముగియకముందే ఉపవాసాన్ని విరమించాలి.
ఆరోగ్య కారణాల వల్ల పూర్తిగా ఉపవాసం చేయలేని వారు పండ్లు లేదా సాత్వికాహారం తీసుకోవచ్చు. ఉపవాసంతో పాటు రాత్రి జాగరణ చేసి విష్ణు కథలు వినడం, అష్టాక్షరి మంత్ర జపం, భజనలు చేయడం శ్రేయస్కరంగా భావిస్తారు. బ్రహ్మచర్యం పాటిస్తూ, వాదనలు, దూషణలు వంటి వాటికి దూరంగా ఉండి భక్తిశ్రద్ధలతో పూజలు చేయాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి.
