
D Spiritual: Feb 21: వడ్డీకాసులవాడైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి హైదరాబాద్‌కు చెందిన భక్తుడు శివకోటి సిద్ధార్థ భారీ విరాళం అందజేశారు. శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళంగా సమర్పించి తన భక్తిని చాటుకున్నారు.
ఈ సందర్భంగా తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరికి విరాళ చెక్కును అందజేశారు. భక్తుల సహకారంతో విద్యాదాన ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా, కలియుగ ప్రత్యక్ష దైవం కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు నిండిపోయాయి. శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు.
టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం సుమారు 20 గంటల్లో పూర్తవుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్కరోజే 68,156 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 28,295 మంది తలనీలాలు సమర్పించారు. భక్తుల కానుకల ద్వారా హుండీకి రూ.3.46 కోట్లు ఆదాయం వచ్చినట్లు అధికారులు వివరించారు.
