
DNews: Feb 13: తెలంగాణలోని నల్గొండ జిల్లా నేరేడు చెర్ల మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీకి తొలి విజయాన్ని సాధించింది. 14వ వార్డులో జనసేన అభ్యర్థి ఆరూరి విజయలక్ష్మి 60 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయంతో పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తూ, తెలంగాణలో జనసేన విజయానికి తొలి అడుగు పడిందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరి ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఆయన మాట్లాడుతూ – “తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారి జనసేన తరఫున పోటీ చేశాం. నల్గొండ జిల్లా నేరేడు చెర్ల మున్సిపాలిటీ 14వ వార్డులో విజయం సాధించిన ఆరూరి విజయలక్ష్మికి హృదయపూర్వక అభినందనలు. మహిళ ద్వారా తొలి విజయాన్ని సాధించడం గర్వకారణం. అది కూడా జాతీయ మహిళా దినోత్సవం రోజున జరగడం విశేషం. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి ఒక్కరికి, ప్రచారంలో పాల్గొన్న జనసైనికులు మరియు వీర మహిళలకు నా కృతజ్ఞతలు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా, మరింత ఉత్సాహంతో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తాను. గత కొన్ని నెలలుగా నన్ను అండగా నిలిచిన ప్రతి నాయకుడికి, కార్యకర్తలకు ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేన జెండాను మరింత బలంగా ఎగరేయడానికి మనమంతా కలిసికట్టుగా పని చేయాలి” అని రామ్ తల్లూరి పేర్కొన్నారు.
