
DSports 12Feb 2026:లాహోర్/కాబూల్: పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 11వ ఎడిషన్ వేలానికి ముందు ఊహించని పరిణామం ఎదురైంది. అఫ్గానిస్తాన్‌కు చెందిన అగ్రశ్రేణి క్రికెటర్లు ఈ ఏడాది పీఎస్ఎల్ వేలం నుంచి తమ పేర్లను ఉపసంహరించుకున్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు, సరిహద్దు వివాదాల ప్రభావం ఇప్పుడు క్రీడలపై పడింది. అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) తమ ఆటగాళ్లకు నిరభ్యంతర పత్రాలు (NOC) ఇచ్చేందుకు నిరాకరించడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
- గత ఏడాది అఫ్గానిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ సైన్యం జరిపిన వైమానిక దాడులే ఈ వివాదానికి ప్రధాన కారణం. ఒక స్థానిక మ్యాచ్ ముగించుకుని వస్తున్న ముగ్గురు అఫ్గాన్ యువ క్రికెటర్లు (కబీర్, సిబ్ఘతుల్లా, హరూన్) ఈ దాడుల్లో మరణించడం అఫ్గాన్ క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఈ ఘటనకు నిరసనగా పాకిస్థాన్‌తో జరగాల్సిన ముక్కోణపు టీ20 సిరీస్ నుంచి అఫ్గానిస్తాన్ ఇప్పటికే తప్పుకుంది. అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తూ.. దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని, పాక్ దుశ్చర్యలకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
