
D Spiritual: Feb 10: తిరుమలలో ఏడుకొండల వేంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాలను ఎలాంటి అసౌకర్యం లేకుండా, సులభంగా అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం లడ్డూ వితరణశాలల్లో కౌంటర్ల వద్ద భక్తుల రద్దీ అధికంగా కొనసాగుతుండటంతో, ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
ఇప్పటివరకు అమలులో ఉన్న వివిధ విధానాలున్నప్పటికీ, లడ్డూ కౌంటర్ల వద్ద పొడవైన క్యూలైన్లు ఏర్పడుతున్నాయి. గత కొంతకాలంగా అమలవుతున్న కియోస్క్ యంత్రాల ద్వారా డిజిటల్ పేమెంట్ లేదా నగదు చెల్లింపుల సమయంలో కూడా రద్దీ పెరుగుతోంది. కొన్నిసార్లు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో భక్తులు ఎక్కువసేపు నిరీక్షించాల్సి వస్తోంది. ఐదు నుంచి పది లడ్డూలు పొందేందుకు కూడా ఎక్కువ సమయం వేచిచూడాల్సి వస్తోందని పలువురు భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిస్థితిని అధిగమించి భక్తులకు వేగంగా, సాఫీగా లడ్డూ ప్రసాదం అందించేందుకు టీటీడీ నూతన ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో చిరుమామిళ్ల వెంకయ్య చౌదరి వినూత్న నిర్ణయం తీసుకున్నారు. లడ్డూ కౌంటర్ల వద్దనే డిజిటల్ పేమెంట్ (యూపీఐ) ద్వారా చెల్లింపులు చేసుకునేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు.
ఈ విధానం అమలులోకి వస్తే, భక్తులు కియోస్క్‌ల వద్ద లేదా ప్రత్యేక క్యూలైన్లలో ఎక్కువసేపు నిలబడాల్సిన అవసరం లేకుండా నేరుగా లడ్డూ కౌంటర్ల వద్దకు వెళ్లి యూపీఐ ద్వారా చెల్లింపులు చేసి లడ్డూలు పొందవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీనివల్ల భక్తుల సమయం ఆదా కావడంతో పాటు రద్దీ కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
తిరుమలకు ప్రతిరోజూ సుమారు 90 వేల మంది భక్తులు వస్తుండగా, రోజువారీగా సగటున 80 వేల మంది వరకు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో లడ్డూ ప్రసాదం పొందేందుకు వితరణశాలల వద్ద భక్తులు భారీగా బారులు తీరుతున్నారు. రోజుకు సగటున నాలుగు లక్షల వరకు లడ్డూలు విక్రయమవుతున్నాయి. ఈ రద్దీని తగ్గించేందుకు ఇప్పటికే టీటీడీ కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేసింది.
కియోస్క్‌ల ద్వారా యూపీఐ విధానంలో చెల్లింపు చేస్తే ఒక్కో భక్తునికి గరిష్టంగా ఐదు లడ్డూల వరకు పొందే అవకాశం ఉంది. కియోస్క్ ద్వారా పొందిన రశీదును కౌంటర్ సిబ్బందికి చూపిస్తే లడ్డూలు అందజేస్తున్నారు. అయితే ఈ విధానానికి కూడా భక్తుల నుంచి మంచి స్పందన రావడంతో కియోస్క్‌ల వద్ద కూడా రద్దీ పెరిగిన పరిస్థితి నెలకొంది.
దీంతో భక్తులకు మరింత సులభమైన ప్రత్యామ్నాయాన్ని అందించాలనే ఉద్దేశంతో, లడ్డూ కౌంటర్ల వద్ద క్యూఆర్ కోడ్ బోర్డులు, స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. శ్రీవారి దర్శనానంతరం భక్తులు నేరుగా కౌంటర్ వద్దకు చేరుకుని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. దీనివల్ల లడ్డూలు వేగంగా, సత్వరంగా అందించేందుకు అవకాశం కలుగుతుంది.
తిరుమలలో మొత్తం సుమారు 60 లడ్డూ కౌంటర్లు ఉండగా, తొలి విడతలో ఈ వారంలో 20 కౌంటర్లలో ఈ కొత్త విధానాన్ని అమలు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. రానున్న వేసవికాలంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, ముందస్తుగానే ఆధునిక సాంకేతిక సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి టీటీడీ చర్యలు చేపడుతోంది.
ఈ యూపీఐ చెల్లింపు సేవలు పూర్తిగా అందుబాటులోకి వస్తే, లడ్డూల కోసం భక్తులు ఎదుర్కొనే నిరీక్షణ ఇబ్బందులు గణనీయంగా తగ్గుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తిరుమలలో సేవా టిక్కెట్లు, వీఐపీ బ్రేక్ దర్శనాల టిక్కెట్లకు సంబంధించి డిజిటల్ పేమెంట్ ద్వారా ఆన్లైన్‌లో చెల్లింపులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రతి భక్తునికి ఒక లడ్డూ ఉచితంగా అందిస్తుండగా, అదనపు లడ్డూల కోసం కౌంటర్ల వద్ద క్యూలో నిలవాల్సి వస్తోంది. ఇకపై లడ్డూలకు కూడా యూపీఐ చెల్లింపుల విధానం అమలైతే, భక్తులకు క్యూలైన్లలో నిరీక్షణ బాధలు తప్పనున్నాయి.
