
D Spiritual: Feb 10: అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి 30వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు, ముఖ్యంగా మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి సారె, చీరలు సమర్పించేందుకు తలపై పళ్లెములు మోస్తూ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఈ భక్తిపూర్వక మహోత్సవంలో ప్రత్యేక పూజలు, ప్రసాద వితరణతో పాటు అన్నసమారాధన కార్యక్రమాలను నిర్వహించారు.
గాంధీ నగర్లో వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో 30వ వార్షికోత్సవాన్ని ఊరంతా కలిసి వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలంతా కలిసి అమ్మవారికి సారె, చీరలను సమర్పించారు. వేలాది మంది మహిళలు ఒకేసారి అమ్మవారికి సారెను తలపై పెట్టుకొని ఊరేగింపుగా తరలివచ్చారు. ఈ దృశ్యం ఎంతో వైభవంగా, కన్నుల పండుగగా కనిపించింది.
భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూలు, వివిధ రకాల స్వీట్లు, ప్రసాదాలు, పిండి వంటలు, పసుపు, కుంకుమ, చీరలను పళ్లెల్లో పెట్టుకుని తలపై మోస్తూ ఊరేగింపుగా సాగారు. ఈ ఊరేగింపు అమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి ప్రారంభమై గారపాటివారి వీధి, మహిపాల వీధి, గాంధీ నగర్ మీదుగా కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకుంది. మహిళలు భక్తితో అమ్మవారికి సారె సమర్పించి తమ మొక్కులను చెల్లించుకున్నారు.
ఆలయ అర్చకులు రామేశ్వరవరపు రామప్రసాద్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి సమర్పించిన సారెలను ప్రసాదంగా భక్తులకు పంపిణీ చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు భక్తులకు ప్రసాదాలు, గాజులు పంపిణీ చేశారు. తరువాత నిర్వహించిన భారీ అన్నసమారాధనలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.
