
DSports 06Feb 2026: ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో భారత కుర్రాళ్ల జైత్రయాత్ర కొనసాగుతోంది. టోర్నీ ఆరంభం నుండి అద్వితీయ ప్రదర్శన కనబరుస్తున్న ఆయుష్ మాత్రే బృందం, ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం జరిగిన రెండో సెమీఫైనల్‌లో అఫ్గానిస్థాన్‌పై ఘనవిజయం సాధించి, భారత్ రికార్డు స్థాయిలో 10వ సారి ఫైనల్‌కు చేరుకుంది.
- సెమీఫైనల్‌లో అఫ్గానిస్థాన్ నిర్దేశించిన 311 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా కేవలం 41.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అండర్-19 ప్రపంచకప్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ ఛేదన కావడం విశేషం. ఓపెనర్ ఆరోన్ జార్జ్ (115) అద్భుత శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆరంభంలో తడబడిన కెప్టెన్ ఆయుష్ మాత్రే (62) కీలక సమయంలో బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కేవలం 33 బంతుల్లో 68 పరుగులు చేసి భారత్‌కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు.
- నేడు (ఫిబ్రవరి 6) జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరగనున్న ఫైనల్‌లో భారత్, ఇంగ్లండ్‌తో తలపడనుంది.ఇప్పటికే ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన భారత్, ఇప్పుడు ఆరోసారి ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలతో ఉంది. ఇంగ్లండ్ కూడా ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. దీంతో ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. 2022లో భారత్ తన ఐదో టైటిల్‌ను ఇంగ్లండ్‌ను ఓడించే గెలుచుకుంది. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత మళ్ళీ అదే ప్రత్యర్థితో తుది పోరులో తలపడుతుండటం గమనార్హం.
