
DNews:05 Feb: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను అన్ని రంగాల్లో వంచించిందని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటుతో “సురుకు పెట్టాలని” ఆయన పిలుపునిచ్చారు. అలా చేయకపోతే వారి అబద్ధపు హామీలు, మోసపూరిత పాలన నిరంతరాయంగా కొనసాగుతాయని హెచ్చరించారు.
ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన KLSR ఇన్ఫ్రా బినామీ కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ, దివాళా తీసిన కంపెనీకి రూ. 6,000 కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టడం అత్యంత దారుణమని కేటీఆర్ ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాల్లేవు, రైతులకు రుణమాఫీ కాలేదు, మహిళలకు మహాలక్ష్మి పథకం సరిగ్గా అందడం లేదు కానీ.. ముఖ్యమంత్రి బినామీలకు మాత్రం వేల కోట్ల ప్రజాధనం దోచిపెడుతున్నారని ఆరోపించారు. ఈ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్, హరీశ్‌రావు మరియు తనపై అక్రమ కేసులు, విచారణల పేరుతో రేవంత్ రెడ్డి “డైవర్షన్ పాలిటిక్స్” చేస్తున్నారని మండిపడ్డారు. పట్టణ ప్రజల సమస్యలను గాలికొదిలేసిన కాంగ్రెస్‌కు ఈ మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉందని, కారు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ అహంకారాన్ని దించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
